వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు చాలా మంది సిట్టింగ్‌లకు షాకులు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. చంద్రబాబు ఎన్నికలు దగ్గరపడుతోన్న వేళ సగటున ప్రతి 10 వారాలకు ఒకసారి సర్వే చేస్తున్నారు. ఈ సర్వే ఫలితాలను ఎప్పటికప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలకు అందచేస్తూ ఎవరి పనితీరు ఎలా ఉంటుందో ? కూడా చెపుతున్నారు. పనితీరు సరిగా లేని వారిని చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. తాజాగా చంద్రబాబు చేయించిన సర్వేలో ఓవరాల్‌గా ప్రభుత్వ పనితీరుపై 63 శాతం మంది ప్రజలు సంతృప్తితో ఉన్నట్టు తేలిందన్న విషయాన్ని కూడా ఆయనే స్వయంగా చెప్పారు.
సంతృప్తిని మరో ఐదు శాతానికి....
అయితే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఇది సరిపోదని వచ్చే సమ్మర్ నాటికి దీనిని మరో 5 శాతానికి పెంచాలని కూడా చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఏపీలో రాజధాని కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలో టీడీపీ చాలా బలంగా ఉంది. అయితే ఇక్కడ కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు జిల్లాలో నలుగురు సిట్టింగ్‌లను పక్కన పెట్టేస్తారన్న వార్తలు వస్తున్నాయి. వీరిలో కొందరిని పనితీరు ఆధారంగా, మరికొందరిని ఇతర ఈక్వేషన్లతోనూ పక్కన పెట్టేయనున్నారు.
ఆ నలుగురు వీరే...
ఈ నలుగురిలో నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య - పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ - పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు - పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఉప ఎన్నికల్లో గెలిచిన నందిగామ ఎమ్మెల్యే సౌమ్య పనితీరుపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీడీపీ కంచుకోట అయిన నందిగామలో సౌమ్య పనితీరుపై స్థానిక నాయకులే పెదవి విరుస్తున్నారు. ఆమె స్థానికంగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో పాటు ఆ నియోజకవర్గ టీడీపీ నాయకులు అంతా మంత్రి దేవినేని ఉమాపైనే ఆధారపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడ వచ్చే ఎన్నికల్లో స్థానికంగా పట్టున్న నాయకుడికి సీటు ఇవ్వాలని చూస్తున్నారు.
పనితీరు బాగానే ఉన్నా....
ఇక టీడీపీకి బలమైన నియోజకవర్గం అయిన పెనమలూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పనితీరు బాగానే ఉన్నా ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో మంత్రి నారా లోకేష్ పేరు వినిపిస్తోంది. లోకేష్ పోటీ చేయని పక్షంలో మైలవరంలో వ్యతిరేకత ఎదుర్కొంటోన్న మంత్రి దేవినేని ఉమా కన్ను కూడా పెనమలూరు మీదే ఉంది. పెనమలూరు మీద పార్టీలో పలువురు ప్రముఖుల కన్ను ఉండడంతో జూనియర్ అయిన బోడేను నామినేటెడ్ పదవి ఇచ్చి తప్పిస్తారన్న వార్తలు వస్తున్నాయి.
వర్లకు ఇస్తే....
ఇక పామర్రులో పార్టీ మారిన ఉప్పులేటి కల్పనను తప్పించి అక్కడ నుంచి వర్ల రామయ్య లేదా మాజీ ఎమ్మెల్యే దాస్‌లలో ఎవరో ఒకరు పోటీ చేయవచ్చంటున్నారు. పామర్రులో రామయ్యకే ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. అయితే కల్పన భర్తకు బాపట్ల ఎంపీ సీటు ఇవ్వడం ఖాయమైనందునే ఆమెను ఇక్కడ తప్పిస్తారని అంటున్నారు. ఇక పెడనలో సీనియర్ అయిన కాగిత వెంకట్రావు అనారోగ్యంతో సరిగా తిరగలేకపోతున్నారు. దీంతో ఆయనకు నామినేటెడ్ పదవి ఇచ్చి అక్కడ నుంచి మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ లేదా మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ ఫ్యామిలీకి చెందిన వారిలో ఎవరో ఒకరిని బరిలోకి దింపవచ్చని తెలుస్తోంది. ఏదేమైనా ఈ నలుగురు సిట్టింగ్‌లకు మాత్రం వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ లేదన్నదే జిల్లాలో బలంగా వినిపిస్తోంది.