ఆర్ కృష్ణయ్య... బీసీ నేత. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేది కృష్ణయ్య చాలా తక్కువ. పార్టీ సిద్ధాంతాలు ఆయనకు పట్టవు. పార్టీ టిక్కెట్ మీద గెలిచినా టీడీపీ కార్యాలయం ఛాయలకు కూడా ఆయన ఎప్పుడూ రారు. ఆయనది ఒకటే మంత్రం. అదే బీసీ మంత్రం. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య తెలంగాణలో టీడీపీ మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు. అయితే గతకొంత కాలంగా కృష్ణయ్య వ్యవహారశైలి టీడీపీకి మింగుడుపడటం లేదు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన పొగడ్తలు కురిపిస్తున్న కృష్ణయ్య ఏపీలో తెలుగుదేశం పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. ఆర్ కృష్ణయ్యను కట్టడి చేసేందుకు కూడా పార్టీ నేతలు ప్రయత్నించకపోవడం విశేషం. ఎందుకంటే ఆయన ఎవరి మాట వినరు. ఆయన అనుకున్నదే చేస్తారు. ఆయన బీసీల పక్షపాతి. బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఆయన సొంత పార్టీని అయినా వదలిపెట్టరన్న సంగతి అందరికీ తెలిసిందే.
కేసీఆర్ కు పొగడ్తలు.. అక్కడ విమర్శలు....
ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కాపులకు రిజర్వేషన్ 5 శాతం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాపులకు రిజర్వేషన్ ఇచ్చినా బీసీలకు అన్యాయం జరగదని టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే చెప్పారు. వారిని ఎఫ్ కేటగిరీ కింద చేర్చామని అందువల్ల బీసీలకు ఎటువంటి ఇబ్బంది లేదంటున్నారు టీడీపీ అధినేత. అంతేకాదు కాపులకు రాజకీయ రిజర్వేషన్ ను కూడా కల్పించలేదని గుర్తుచేస్తున్నారు. అయినా కృష్ణయ్య వినడం లేదు. బీసీలకు అన్యాయం జరుగుతుందని గొంతెత్తారు. ఏపీలో బీసీలందరినీ ఏకతాటి పైకి తెచ్చి ఉద్యమానికి నడుంబిగించారు. కొందరు టీడీపీ నేతలు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా కృష్ణయ్య విన్పించుకోవడం లేదు. దీంతో ఆయన త్వరలోనే ఏపీలో బీసీ ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. మరోవైపు తెలంగాణలో గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. బీసీ ఎమ్మెల్యేలంతా కలిసిచేసిన ప్రతిపాదనను ప్రభుత్వం అమలు చేస్తుందని కేసీఆర్ చెబుతున్నారు. తెలంగాణలో మాత్రం కేసీఆర్ ను కృష్ణయ్య తెగ పొగిడేస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఏపీ నేతలకు కృష్ణయ్య వ్యవహారం మింగుడుపడటం లేదు.