కూతుళ్లకు ఎమ్మెల్యే సీట్ల కోసం...!

Update: 2018-02-01 00:30 GMT

తెలంగాణ రాజ‌కీయాల్లో టికెట్ల వార్ ఇప్పుడిప్పుడే మొద‌లైంది. త‌మ రాజ‌కీయ వార‌సులను రంగంలోకి దించేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అంతా త‌మ కొడుకుల‌ను, అల్లుళ్ల‌ను, త‌మ్ముళ్ల‌ను వార‌సులుగా తీసుకొస్తుండ‌గా ముగ్గురు నాయ‌కులు మాత్రం కూతుళ్ల‌ను బ‌రిలోకి దించ‌బోతున్నారు. ఇందుకు సంబంధించిన గ్రౌండ్ వ‌ర్క్‌ను కూడా ఇప్ప‌టికే సిద్ధం చేసి ఉంచారు. వాళ్ల రాజ‌కీయ భ‌విష్య‌త్‌కు బ‌ల‌మైన పునాదులు వేసేందుకు స‌రైన నియోజ‌క‌వ‌ర్గాల‌ను కూడా ఎంపిక చేశారు. ఇంత వ‌ర‌కూ బాగానే ఉన్నా..వీరి చర్య‌ల‌తో సిట్టింగ్ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు ప‌రిగెడు తున్నాయ‌ట‌. త‌మ సీటుకు నాయ‌కులు ఎసరు పెడుతున్నార‌ని వాపోతున్నార‌ని తెలుస్తోంది. ఫలితంగా క్యాడ‌ర్‌లో ఇప్పుడిప్పుడే అసంతృప్తి సెగ‌లు చెల‌రేగుతున్నాయి.

స్టేషన్ ఘన్ పూర్ లో...

వ‌రంగల్ ఉమ్మడి జిల్లా అధికార పార్టీలో ముగ్గురు నాయ‌కుల‌పై స్థానిక ఎమ్మెల్యేల‌తో పాటు దిగువ స్థాయి నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. కొందరు సీనియర్ నేతలు ( ఎమ్మెల్యేలు) తమ కూతుళ్లకు వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి.. తన కూతురు డాక్ట‌ర్‌ కావ్యను వచ్చే ఎన్నికల్లో బ‌రిలోకి దించాల‌ని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెను స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిపేందుకు పావులు కదుపుతున్నార‌ట‌. ఈ క్రమంలోనే కావ్య పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వ‌హిస్తూ.. ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్ర‌యత్నిస్తున్నారు.

మానుకోటలో....

డోర్నకల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్ తన కూతురు, మానుకోట మాజీ ఎమ్మెల్యే మాలోతు కవితకు టికెట్ కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిగా మానుకోట నియోజకవర్గం నుంచి బరిలో నిలిపేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకోసం ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ నాయ‌క్‌కు చెక్ పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో వైపు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ కొండా మురళి దంపతుల కుమార్తె సుస్మితా పటేల్ ను తమ వారసురాలిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించనున్నట్లు వారి అనుచరులు స్ప‌ష్టంచేస్తున్నారు.

భూపాలపల్లిలో....

ప్రస్తుతం వంచన గిరి పీఏసీ ఎస్ చైర్ పర్సన్ గా ఉన్న కొండా సుస్మితా పటేల్ ను పరకాల లేదా భూపాలపల్లి నుంచి పోటీలో నిలిపే ఆలోచ‌న‌లో కొండా దంప‌తులు ఉన్నార‌ట‌. కాగా ఈ సీనియర్ నేతలందరు తమ కూతుళ్ల‌ కోసం సిట్టింగ్ స్థానాలకే ఎసరు పెడుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆయా స్థానాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలు ఈ నాయకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వీరి పేర్లు వినిపించినా మిగిలిన వారు కూడా ఇదే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ అసంతృప్తి సెగ‌ల‌ను కేసీఆర్ ఏవిధంగా చ‌ల్లారుస్తారో వేచిచూడాల్సిందే!!

Similar News