టీం ఇండియా సీనియర్ జట్టులో సభ్యుడు కావాలంటే తొలిమెట్టు గా వుండే అండర్ 19 లో రాణించాలి. భారత అండర్ 19 టీం లో సభ్యుడు కావడం అంటే ఆషా మాషి కాదు. అండర్ 19 నుంచే యువరాజ్, కోహ్లీ వంటి ఆణిముత్యాలు టీం ఇండియా కు ఎంపిక అయ్యి ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు. మన చిన్న టీం మరోసారి అద్భుతం సృష్ట్టించింది. ఆస్ట్రేలియా లో తాజాగా జరుగుతున్న అండర్ 19 ప్రపంచ కప్ లో సెమిస్ లో పాకిస్తాన్ ను చిత్తుచేసి ఆరవసారి ఫైనల్ కు దూసుకువెళ్లింది. లీగ్ దశలో ఏ మ్యాచ్ లోను ఓటమిని ఎరుగని టీం ఇండియా తన అసాధారణ ఆటతో కుర్ర ప్రపంచకప్ లో రాణించడం రొటీన్ గా చేసుకుంది.
భారీ ఆధిక్యంతో పాక్ ను ఓడించిన కుర్రోళ్ళు .....
తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 9 వికెట్లు నష్టపోయి 272 పరుగులు సాధించింది. గిల్ 102, కెప్టెన్ పృథ్విషా 41, కల్రా 47 పరుగులతో భారీ స్కోర్ కి బాటలు వేశారు. తరువాత బ్యాటింగ్ కి దిగిన పాకిస్తాన్ మన బౌలర్ల విజృంభణకు పేక మేడలా కుప్పకూలింది. 69 పరుగులకే ఆలౌట్ అయ్యి భారత్ ఫైనల్ చేరుకోవడానికి అడ్డు తొలగింది. ఫిబ్రవరి 3 న భారత్ ఆస్ట్రేలియా తో ఫైనల్ మ్యాచ్ లో తలపడనుంది. అండర్ 19 అద్భుత విజయాల్లో టీం కోచ్ రాహుల్ ద్రావిడ్ అసమాన శక్తి పనిచేస్తుంది. భారత్ కి భావి క్రికెటర్ల తయారీలో మిస్టర్ వాల్ అకుంఠిత దీక్షతో తన శక్తి యుక్తులను ధారపోస్తూ ప్రపంచ తలమానిక యువ క్రికెట్ సైన్యాన్ని సిద్ధం చేయడం విశేషం.