కుమార్తె కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేకు మంత్రి ఎర్త్‌

Update: 2018-01-04 06:30 GMT

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అంతా వార‌సుల రాజ‌కీయ‌మే ఎక్కువుగా క‌న‌ప‌డుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వార‌సుల కోసం నాయ‌కులు, మంత్రులు, ఎంపీలు సీట్ల‌పై ఖ‌ర్చీఫ్‌లు వేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు సిట్టింగ్‌ల స్థానాల‌కు ఎర్త్ పెట్టే ప‌నిలో కూడా ఉంటున్నారు. తెలంగాణ‌లో చూస్తే అధికార టీఆర్ఎస్ పార్టీలో ఆరేడుగురు ఎంపీలు ఏకంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే ప్ర‌య‌త్నాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు పొగ పెట్టే ప్ర‌య‌త్నాలు తెర‌వెనక మొద‌లెట్టార‌న్న‌ది ఇప్పుడు అధికార పార్టీ వ‌ర్గాల్లోనే జోరుగా చ‌ర్చ‌కు వ‌స్తోంది.

కడియం కన్ను ఇక్కడే....

ఇదిలా ఉంటే కేబినెట్‌లో కీల‌క ప‌ద‌విలో ఉన్న ఓ మంత్రి అయితే త‌న కుమార్తె సీటు కోసం ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఎర్త్ పెట్టే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఆ మంత్రి ఎవ‌రో కాదు తెలంగాణ డిప్యూటీ సీఎం క‌డియం శ్రీహ‌రి. వ‌రంగ‌ల్ జిల్లాలో స్టేష‌న్‌ఘ‌న‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీఆర్ఎస్ త‌ర‌పున మాజీ డిప్యూటీ సీఎం టి.రాజ‌య్య ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి క‌డియం శ్రీహ‌రి మీద గెలిచిన ఆయ‌న ఆ త‌ర్వాత 2012 ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి మ‌ళ్లీ క‌డియం మీదే విజ‌యం సాధించారు.

కావ్య ను రంగంలోకి దింపి...

గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు క‌డియం కూడా టీఆర్ఎస్‌లోకి వ‌చ్చి ఆయ‌న వ‌రంగ‌ల్ ఎంపీగా గెలిస్తే రాజ‌య్య ఇక్క‌డ నుంచి ఎమ్మెల్యేగా ఘ‌న‌విజ‌యం సాధించారు. ఆ వెంట‌నే కేసీఆర్ ఆయ‌న‌కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి కూడా ఇచ్చారు. అయితే తీవ్ర‌మైన అవినీతి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఆయ‌న్ను అవ‌మాన‌క‌ర రీతిలో భ‌ర్త‌ర‌ఫ్ చేయాల్సి వ‌చ్చింది. చివ‌ర‌కు ఆ ప్లేస్‌లోకి క‌డియం ఎంట‌ర్ అయ్యారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల వేళ క‌డియం ఇక్క‌డ నుంచి త‌న కుమార్తె క‌డియం కావ్య‌ను రంగంలోకి దింపే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

మరి ఇది జరిగేనా?

ఈ నియోజ‌క‌వ‌ర్గంలో డాక్ట‌ర్ కావ్య ప్ర‌చారం, ఫ్లెక్సీలతో హోరెత్తిపోతోంది. రాజ‌య్య‌పై కేసీఆర్‌కు స‌ద‌భిప్రాయం లేక‌పోవ‌డంతో ఆయ‌న్ను ఎలాగైనా త‌ప్పించేసి ఆ ప్లేస్‌లో త‌న కుమార్తెను పోటీ చేయించేందుకు క‌డియం విశ్వ ప్ర‌య‌త్నాలే చేస్తున్నారు. ఇక క‌డియం ప్ర‌య‌త్నాల‌పై తాజాగా మాదిగ వర్గీకరణ పోరాట సమితి నేత మంద కృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. కడియం శ్రీహరి మాదిగలకు అన్యాయం, ద్రోహం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమార్తెను ఘ‌న్‌పూర్ నుంచి పోటీ చేయించేందుకు రాజ‌య్య‌కు టిక్కెట్ రాకుండా క‌డియం కుట్ర‌లు ప‌న్నుతున్నార‌ని ఆయ‌న ఫైర్ అయ్యారు. ఏదేమైనా కుమార్తె కోసం రాజయ్య‌ను ఎలాగైనా త‌ప్పించేందుకు క‌డియం వేస్తోన్న ఎత్తులు ఇప్పుడు వ‌రంగ‌ల్ జిల్లా రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Similar News