కుప్పంపై జగన్ మనసులో మాట ఇదే...!

Update: 2018-01-06 05:30 GMT

కుప్పం తరహా అభివృద్ధి చేస్తానంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అసలు కుప్పం అంత అభివృద్ధి చెందిందా? దాదాపు ఆరుసార్లు కుప్పం నియోజకవర్గం నుంచి ఎన్నికైన చంద్రబాబు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. దాదాపు పదేళ్లు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు విభజన ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయి మూడున్నరేళ్లవుతుంది. అయితే కుప్పం గురించి జగన్ తన డైరీలో ఏం రాసుకున్నారంటే....? కుప్పం నియోజకవర్గం అత్యంత దయనీయంగా ఉందని జగన్ తన డైరీలో నోట్ చేసుకున్నారు.

9 వేల మందికి రైల్వే పాసులు...

కుప్పం నియోజకవర్గంలో రైతులు దయనీయస్థితిలో ఉందన్నారు. కుప్పం పరిస్థితి పేరుగొప్ప ఊరు దిబ్బలా ఉందని తెలిపారు. అనేక మంది ఉపాధి లేక కుప్పం నియోజకవర్గం నుంచి వేల సంఖ్యలో ప్రజలు రెండు రైళ్లలో బెంగుళూరు వెళుతున్నారన్నారు. వీరిలో దాదాపు 9 వేలమందికి రైల్వే పాసులు తీసుకుని మరీ బెంగుళూరు నుంచి కుప్పం ప్రయాణిస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుందని ఆయన తన డైరీలో రాసుకున్నారు. 13 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కుప్పం నియోజకవర్గం అభివృద్ధికి ఏం చేయలేదని సమస్యలను చూస్తుంటే అర్థమవుతుందన్నారు.

బీసీలు అధికంగా ఉన్నారని....

చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన చంద్రగిరిని వదిలిపెట్టి కుప్పం నియోజకవర్గానికి ఎందుకు వచ్చారో అర్థమయిందన్నారు జగన్. ఇక్కడ బీసీలు, వెనుకబడిన కులాలు అధికంగా ఉండటంతో వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని చంద్రబాబు సంవత్సరాల నుంచి పెత్తనం చెలాయిస్తున్నట్లు కన్పిస్తుందన్నారు. బీసీల గురించి గొప్పలుచెప్పే చంద్రబాబు ఆ నియోజకవర్గాన్ని బీసీలకు ఎందుకు వదలలేదని జగన్ ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గంలో తాగు, సాగునీరు, మౌలిక సదుపాయాలు ఇప్పటి వరకూ కల్పించకపోవడం దారుణమన్నారు. కుప్పం నియోజకవర్గంలో 406 స్కూళ్లుంటే అందులో 338 టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే చంద్రబాబు ఈ నియోజకవర్గంపై ఏపాటి దృష్టిపెట్టారో అర్థమవుతుందన్నారు. చివరిగా రాష్ట్రం దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చెబుతున్న చంద్రబాబు తన నియోజకవర్గమైన కుప్పం వలసలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

Similar News