కుదరంటే...కుదరదంతే

Update: 2018-03-06 12:30 GMT

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం తేల్చి చెప్పింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెల్టాలని నిర్ణయించింది. ఇందుకోసం బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరిపిన అనంతరం ఈ విషయాన్ని తేల్చారు. ప్రత్యేక హోదా కుదరదని తేల్చి చెప్పడం ద్వారా అధికార తెలుగుదేశం పార్టీని బీజేపీ ఇరకాటంలోకి నెట్టేసింది. సెంటిమెంట్ కు లొంగితే ప్రతిరాష్ట్రానికి సెంటిమెంట్లు ఉంటాయని, అందరూ ఢిల్లీకి సెంటిమెంట్ పేరుతో క్యూ కడితే తాము ఏం చేయగలమని ఆర్థిక శాఖ అధికారులు తేల్చి చెప్పినట్లు తెలిసింది. బీజేపీ కూడా ఇదే తమ స్టాండ్ అని చెప్పకనే చెప్పింది.

ఆ రాయితీలనూ ఇవ్వబోం.....

అంతేకాకుండా ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన రాయితీలను కూడా ఏపీకి ఇవ్వడం కుదరదని ఆర్థిక శాఖ అధికారులు తేల్చారు. ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నందున అక్కడ రాయితీలు ఇచ్చామని, ఏపీకి ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు 12,500 కోట్లు ఇచ్చామని, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, వెనకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయించామన్న కేంద్రం, వీటికి సంబంధించి ఒక్క రూపాయికి కూడా లెక్క చెప్పలేదని కేంద్రం ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని నేరుగా చెప్పకుండా ఆర్థిక శాఖ అధికారుల ద్వారా చెప్పించింది.

సెంటిమెంట్ కు చోటు లేదు.....

ఈఏపీకింద నిధులు కావాలని ఏపీ సర్కార్ అడుగుతుందని, అయితే విదేశీ సంస్థల నుంచి రుణం తీసుకోవాలంటే జాప్యం జరుగుతుందని, స్వదేశీ సంస్థల నుంచి రుణం పొందేందుకు అవసరమైన విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వమే తయారు చేసుకుని రావాలని కేంద్రం చెప్పేసింది. ఏపీ ఆందోళనలకు తలొగ్గితే భవిష్యత్తులో కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిషా, బీహార్, బెంగాల్ నుంచి కూడా ఇలాంటి డిమాండ్లు రావన్న గ్యారంటీ ఏందని కేంద్రం ప్రశ్నిస్తోంది. రేపు చంద్రబాబుతో ఈ విషయాలన్నింటిపై ఢిల్లీ పెద్దలు మాట్లాడాలని నిర్ణయించారు.

ఒక్క రూపాయికి కూడా లెక్క లేదు....

ఇక ఆందోళనలు చేసుకుంటే వారి ఇష్టానికే వదిలేస్తున్నామని కూడా కేంద్రం తేల్చేసింది. రెవెన్యూ లోటు కింద తాము 1600 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, 16వేల కోట్లు అంటే కుదరదని కూడా తేల్చేశారు. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం ఏపీలో జరుగుతున్న రచ్చకు చెక్ పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లుంది. రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందుకు బీజేపీ సిద్దమయినట్లే కన్పిస్తోంది. తాము ప్రకటించిన ప్యాకేజీ ఇచ్చేందుకు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నామని, అందుకు ఓకే అనుకుంటే ముందుకు వెళ్లవచ్చని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో చంద్రబాబు రాజకీయంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోని పరిస్థితి తలెత్తింది.ఈరోజు రాత్రికి కేంద్రమంత్రులతో మాట్లాడి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Similar News