కీలక నిర్ణయాల కసరత్తులో చంద్రబాబు,

Update: 2016-10-18 04:38 GMT

చంద్రబాబునాయుడు ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకునేదిశగా తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మరికొందరు కీలక నాయకులతో కలిసి ఆయన ఇవాళ తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తున్నది. పార్టీ మరియు కేబినెట్ సమావేశాలు రెండూ ఒకే రోజు కావడంతో సాయంత్రానికి చంద్రబాబు చాలా నిర్ణయాలను ఫైనలైజ్ చేస్తారని అంతా అనుకుంటున్నారు.

అమరావతిలో ఇవాళ రెండు కీలక సమావేశాలు జరగనున్నాయి. రాబోయే రోజుల్లో పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక ఉండాలనే విషయం చర్చించడానికి పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ఇవాళ జరగబోతోంది. ఉదయం 11గంటలకు ఈ భేటీ ఉంటుంది. ఇంచుమించుగా మంత్రులందరూ కూడా ఇందులో పాల్గొంటారు. అదనంగా పార్టీ కీలక నాయకులు, అధ్యక్ష కార్యదర్శులు, జాతీయ కార్యదర్శి లోకేష్ తదితరులుకూడా ఉంటారు. ముందుగా ప్రకటించిన వివరాల ప్రకారం అయితే.. పార్టీ సంకల్పిస్తున్న జనచైతన్య యాత్రలు, పార్టీ సభ్యత్వ నమోదు అనేది ఈ భేటీకి ఎజెండా! అయితే పార్టీ అవసరాల నిమిత్తం ప్రభుత్వంలోని మంత్రులు వారి శాఖల పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమైనా ఉంటే ఈ సమన్వయ సమావేశంలోనే ఆ పనులు అప్పజెప్పే అవకాశం ఉంది.

అదే సమయంలో మధ్యాహ్నం తరువాత 3 గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. రాష్ట్రంలో రైతాంగం సమస్యల్ని కేబినెట్ భేటీకి ప్రధాన చర్చనీయాంశంగా ఎజెండాలో పెట్టారు. నకిలీ విత్తనాల నియంత్రణ చట్టసవరణ , రెవిన్యూ, వ్యవసాయం తదితర అంశాలు చర్చించబోతున్నారు. పలు పరిశ్రమలకు భూ కేటాయింపుల వ్యవహారం కూడా చర్చకు వస్తుందని తెలుస్తోంది. ఈ రెండు భేటీలకు సంబంధించి అంశాలను ఖరారుచేసే కసరత్తులో చంద్రబాబు మునిగిఉన్నట్లుగా తెలుస్తోంది.

Similar News