కిషన్ రెడ్డి... మొన్నటి వరకూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత ఆయనస్థానంలో అధ్యక్షుడిగా లక్ష్మణ్ వచ్చారు. కిషన్ రెడ్డి ప్రస్తుతం శాసనసభ పక్ష నేతగా ఉన్నారు. ఆయన సీనియర్ నేత. కాని ఆయనకు కమలం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అవమానాలు ఎదురవుతున్నాయి. కిషన్ రెడ్డికి పార్టీ కార్యాలయంలో కూర్చునేందుకు కూడా చోటు లేకుండా చేశారట. ఇప్పుడు ఇది ఆయనకు మింగుడు పడటం లేదు. కిషన్ రెడ్డి ఎక్కువ సంవత్సరాలే పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పుడు ఆయనకు ఒక గది అంటూ ఉండేది. కాని ఇప్పుడు ఆయన రాష్ట్ర కార్యాలయానికి వస్తే కూర్చోవడానికి కూడా సీటు లేదు.
కూర్చునేందుకు సీటు లేక...
కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే రాష్ట్ర కార్యాలయాన్ని ఆధునికీకరించేందుకు కేంద్ర పార్టీ కార్యాలయం ఆరు కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. అయితే పనులు మాత్రం లక్ష్మణ్ బాధ్యతలను తీసుకున్న తర్వాతనే మొదలయ్యాయి. కార్యాలయంలోని మూడు, నాలుగో ఫ్లోర్ లలో త్రీస్టార్ హోటల్ ను తలపించే రీతిలో సౌకర్యాలను సమకూర్చారు. రెండో అంతస్థును మాత్రం పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులకు, కార్యదర్శులకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. పార్టీ అధ్యక్షుడు సమావేశ మందిరాన్ని కూడా రెండో ఫ్లోర్ లోనే నిర్మించారు. అయితే పార్టీ ఫ్లోర్ లీడర్ కు మాత్రం గదిని ఏర్పాటు చేయలేదు.
వెంకయ్య అనుచరుడనేనా?
దీంతో కిషన్ రెడ్డి ఇటీవల పార్టీ కార్యాలయానికి వస్తున్నా ఆయన కూర్చునేందుకు చోటు లేక సమావేశ మందిరంలోనే ఉంటున్నారట. తనకోసం వచ్చే వారిని అక్కడే కలుస్తున్నారు. దీంతో కిషన్ రెడ్డి సన్నిహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ కేటాయించినప్పుడు మాజీ అధ్యక్షుడు, ఫ్లోర్ లీడర్ కు ఎందుకు గదిని కేటాయించలేదని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ మధ్య కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయానికి రావడమే మానుకున్నారు. తన ఎమ్మెల్యే కార్యాలయంలోనే ఆయన కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే కనీసం కిషన్ కూర్చునేందుకు కూడా గదిని కేటాయించకపోవడాన్ని పలువురు కమలం నేతలు తప్పుపడుతున్నారు. కిషన్ రెడ్డికి ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి అనుచరిగా ముద్ర ఉంది. అందుకో్సమే కిషన్ రెడ్డిని పెద్దగా లెక్క చేయలేదంటున్నారు.