కిర్లంపూడిలో టెన్షన్...టెన్షన్

Update: 2017-10-08 05:30 GMT

కిర్లంపూడిలో మళ్లీ టెన్షన్ తలెత్తింది. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మళ్లీ ఆత్మీయ యాత్రకు శ్రీకారం చుట్టడంతో మరోసారి ఆయనను పోలీసులు గృహనిర్భంధం చేశారు. ముద్రగడ ఇంటివద్ద పోలీసులు భారీగా మొహరించారు. ఇటీవలే దాదాపు రెండు నెలల పాటు ముద్రగడను పాదయాత్ర చేయనీయకుండా ఏపీ పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వానికి డిసెంబర్ 26వ తేదీ వరకూ గడువు విధించారు. అయితే ముద్రగడ మరోసారి కాపు సామాజిక వర్గం నేతలను కలుసుకునేందుకు ఆత్మీయ యాత్రలను చేపట్టారు. ఈ నెల 8,9వ తేదీల్లో కోనసీమలో పర్యటించేందుకు ముద్రగడ సమాయత్త మయ్యారు.

ఆత్మీయ యాత్రలను కూడా.....

అయితే పోలీసులు దీనిని కూడా అడ్డుకున్నారు. ముద్రగడను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. ఆత్మీయ యాత్రలకు కూడా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సిందేనని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. తాను వ్యక్తిగత హోదాలో కోనసీమలోనే పర్యటిస్తుంటే ప్రభుత్వం నుంచి అనుమతి ఎందుకని ముద్రగడ ప్రశ్నిస్తున్నారు. కాని పోలీసులు మాత్రం అనుమతి తీసుకోవాల్సిందేనని, అప్పటి వరకూ ఇల్లు కదలడానికి వీల్లేదని స్పష్టం చేశారు. దీనిపై కాపు నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కావాలని ముద్రగడను టార్గెట్ చేసిందని కాపు నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ముద్రగడ గృహనిర్భంధంతో కిర్లంపూడిలో టెన్షన్ నెలకొంది.

Similar News