కన్నడ రాజకీయం హీటెక్కింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కర్ణాటకలో పర్యటిస్తున్నారు. అమిత్ షా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. చిత్రదుర్గలో ఆయన ఈరోజు నవ కర్ణాటక నిర్మాణ పరివర్తన యాత్రను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను టార్గెట్ గా చేసుకుని ప్రసంగించారు. సిద్ధరామయ్య ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకమన్నారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే సిద్ధు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఎటువంటి అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు.
సిద్దూపై షా మండిపాటు....
ఇండియా వ్యతిరేక సంస్థ ఎస్డీపీఐపై కేసులను సిద్ధరామయ్య ప్రభుత్వం ఎందుకు ఉపసంహరించుకున్నారోచెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. అలాగే ర్యాడికల్ గ్రూపు అయిన పీఎఫ్ఐ ఉన్న క్రిమినల్ కేసులన్నింటినీ ఎందుకు తొలగించారో కన్నడ ప్రజలకు సిద్ధరామయ్య జవాబు చెప్పాలన్నారు. హిందూ వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పడానికి ఆలయ అర్చకులకు నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడమేనని అమిత్ షా అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా సిద్ధూ ప్రభుత్వం వెచ్చించడం లేదన్నారు. 13వ ఫైనాన్స్ కమిషన్ కింద కర్ణాటకకు కేంద్రం 88,583 కోట్లు నిధులు ఇస్తే... మోడీ సర్కార్ వచ్చిన తర్వాత 14 ఫైనాన్స్ కమిషన్ కింద కర్ణాటకకు ఆ నిధులను 2,19,500 కోట్లకు పెంచిందని గుర్తు చేశారు. కేంద్రం ఇస్తున్న నిధులు ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నించారు.
సంఘ్ పరివార్ పై సంచలన వ్యాఖ్యలు....
అయితే అమిత్ షా విమర్శలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విరుచుకుపడ్డారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ లో ఉగ్రవాద శక్తులు ఉన్నాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తితే ఎంతటి వారినైనా తాము వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఎస్టీపీఐ అయినా భజరంగ్ దళ్ అయినా తమకు ఒక్కటేనని, శాంతిభద్రతల సమస్య తలెత్తితే అందరికీ ఒకే న్యాయం అమలు చేస్తామని చెప్పారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కన్నడ రాజకీయాలు హీటెక్కాయి. ఒకరిపై ఒకరు విమర్శలు హాట్ హాట్ గా చేసుకుంటున్నారు.