కాసేపట్లో జగన్ షాకింగ్ డెసిషన్...!

Update: 2018-02-12 09:30 GMT

వైసీపీ అధినేత జగన్ ఈరోజు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈరోజు సాయంత్రం వైసీపీ నేతలతో జగన్ కీలక భేటీ నిర్వహించనున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర జరుగుతోంది. ఈ పాదయాత్ర సాయంత్రానికి కలిగిరి మండలం పెద్దకొండూరు చేరుకోనుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన శిబిరంలో జగన్ కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్లమెంటుసభ్యులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ ఛార్జులు హాజరు కావాలని ఇప్పటికే ఆదేశాలు అందాయి. ఇప్పటికే వైసీపీ నేతలందరూ నెల్లూరు చేరుకున్నారు.

శిబిరంలో కీలక భేటి....

ఈ సమావేశంలో రాష్ట్రంలో, కేంద్రంలో జరగుతున్న రాజకీయ పరిణామాలు, ప్రత్యేక హోదా, బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులపై జగన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో పార్లమెంటు సభ్యుల రాజీనామాలపై ఒక కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటం, ప్రత్యేక హోదాను కేంద్రం ఇవ్వకపోతుండటంతో ఇక రాజీనామాలతోనే ప్రజల ముందుకు వెళ్లాలని జగన్ నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే ఎంపీలతో ఒకసారి జగన్ మాట్లాడినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు.

ప్రత్యేక హోదా ఉద్యమంపై కూడా....

అయితే ఈ సమావేశంలో అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. ఎందుకంటే రాజీనామాలు చేస్తే ఏకపక్షంగా జగన్ నిర్ణయించారని, కనీసం నేతలను సంప్రదించలేదని తనపై విమర్శలు తలెత్తకుండా జగన్ ఈ కీలక భేటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అందరూ విధిగా పాల్గొనాలని సందేశాలు పంపారు. దీంతో వైసీపీ నేడు కీలక నిర్ణయం తీసుకోనుందన్న వార్తలు వస్తున్నాయి. ఏపీ విభజన హామీల అమలుపై దశల వారీ పోరాటం చేయాలా? ప్రత్యేక హోదాపై ఉద్యమాన్ని మరింత ఉధృతం ఎలా చేయాలన్న అంశంపై జగన్ నేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ తమపై చేస్తున్న విమర్శలపై కూడా చర్చ జరిగే అవకాశముంది.

Similar News