త్రిపుర ఎన్నికలు నేడు జరగబోతున్నాయి. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న త్రిపుర ఎన్నికల్లో హోరాహోరీ పోరుసాగుతుంది. ప్రధానంగా సీపీఎం, బీజేపీల మధ్యే పోరు ఉంటుందన్నది అంచనా. సర్వే సంస్థలు కూడా టైట్ ఫైట్ అని తేల్చేయడంతో ఇప్పుడు అందరి దృష్టీ త్రిపుర ఎన్నికల పైనే ఉంది. సుమారు 25 ఏళ్ల పాటు పాలించిన సీపీఎంకు మరోసారి తన కంచుకోటను నిలబెట్టుకోవాలని తీవ్ర ప్రయత్నమే చేస్తోంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో త్రిపురను చేజిక్కించుకుని కమ్యునిస్టులకు కాలం చెల్లిందని నిరూపించలని కమలనాధుల ప్రయత్నం.
సీపీఎంను దెబ్బకొట్టేందుకు....
ఈరోజు ఎన్నికలు జరగుతున్నా మార్చి 3వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. ఈరోజు జరిగే ఎన్నికలు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో మొన్నటి వరకూ సీపీఎంకు గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మాత్రం చతికల పడింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీది ప్రేక్షపాత్రేనన్నది విశ్లేషకుల అంచనా. మరోవైపు గ్రామాల్లో పట్టున్న సీపీఎంను చావుదెబ్బ తీసేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేసింది. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్ నాధ్ సింగ్, అరుణ్ జైట్లీ, స్మృతి ఇరాని, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ లను ప్రచారరంగంలోకి దించింది. ఇక మోడీ త్రిపుర ఎన్నికల ప్రచారంలో శివాలెత్తిపోయారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నది కమ్యునిస్టులే అని తీవ్ర విమర్శలు చేశారు.
కాంగ్రెస్ నామమాత్రమే....
ఈరోజు జరగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో 59 స్థానాలకు మాత్రమే ఎన్నిక జరగనుంది. ఛరిలామ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈరోజు జరగాల్సిన ఎన్నికను మార్చి 12వ తేదీకి వాయిదావేశారు. ఇక్క సీపీఎం అభ్యర్ధి మరణించడంతో ఈ ఎన్నిక వాయిదా పడింది. ఇక బీజేపీ ఇక్కడ 51 స్థానాల్లో పోటీ చేస్తుండగా, దాని మిత్రపక్షమైన ఇండిజీనస్ పీపుల్స్ ఫ్రంట్ తొ్మ్మిది స్థానాల్లో బరిలోకి దిగింది. సీపీఎం మాత్రం 57 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన మూడు స్థానాలను సీపీఐ, ఫార్వార్డ్ బ్లాక్, ఆర్ఎస్పీ లకు వదిలేసింది. కాంగ్రెస్ మాత్రం ఒంటరిగానే 59 స్థానాల్లో పోటీ చేస్తుండటం విశేషం. అయితే ఈ పోటీ నామమాత్రమే. మొత్తం మీద త్రిపుర ఎన్నిక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడానికి అక్కడ కమలం పార్టీ పుంజుకోవడమే. మొత్తం మీద త్రిపుర ఎన్నికల్లో గెలుపు ఎవరన్నది ఉత్కంఠను రేపుతోంది. కాషాయమా? కమ్యునిజమా? అన్నది మార్చి 3న తేలిపోనుంది.