శివసేన కాషాయ కూటమి నుంచి విడిపోవడానికే సిద్ధమయినట్లుంది. అలాగే బీజేపీ కూడా పులితోక పట్టుకుని వేళ్లాడేందుకు ఇష్టపడటం లేదు. గత కొన్నాళ్లుగా బీజేపీ, శివసేన ల మధ్య ప్రచ్ఛన్నయుద్ధమే జరుగుతోంది. నోట్ల రద్దు అంశం దగ్గర నుంచి శివసేన బీజేపీపై దూకుడుపెంచింది. తన అధికార పత్రిక సామ్నాలో మోడీ విధానాలపై విరుచుకు పడుతూనే ఉంది. మంత్రివర్గ విస్తరణ ఈ రెండుపార్టీల మధ్య మరింత అగాధాన్నే పెంచిందని చెప్పాలి. ముంబయి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా రెండు పార్టీలూ విడివిడిగానే పోటీ చేశాయి. నాగపూర్ మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. ముఖ్యంగా మోడీ అంటేనే శివసేన విరుచుకుపడుతోంది.
బీజేపీ మండిపాటు....
ఈ నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వరుసగా చేస్తున్న ప్రకటనలు బీజేపీకి కూడా ఆగ్రహం తెప్పిస్తున్నాయి. మోడీ ఒక గ్రాండ్ మాస్టర్ అని, మోడీపని అయిపోయిందని సంజయ్ రౌత్ నిన్న వ్యాఖ్యానించగా, నేడు కాంగ్రెస్ నేత రాహుల్ సమర్ధ నాయకుడని నేడు సంజయ్ రౌత్ ప్రశంసలు కురిపించారు. అంతేకాదు మోడీ ప్రభ తగ్గిపోయిందని, దేశ ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారన్నారు. దేశాన్ని నడిపించగల సత్తా రాహుల్ కు ఉందన్నారు. ఇలా శివసేన నేతలు కాంగ్రెస్ పై ప్రశంసలు, బీజేపీపై విమర్శలు వరుసగా గుప్పిస్తుండటంతో మహారాష్ట్ర్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఫైరయ్యారు. ‘ఉంటే ఉండండి. ఇష్టం లేకుంటే బయటకు వెళ్లండి.అంతేతప్ప పొత్తు ధర్మాన్ని విస్మరిస్తూ శివసేన నాయకులు ఏది మాట్లాడితే అది కుదరదు’ అని తెగేసి చెప్పారు. తమ ప్రభుత్వంలో కొనసాగున్న శివసేన ప్రతిపక్ష పాత్ర పోషిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరింాచరు. కూటమిలో ఉండాలో లేదో శివసేన తేల్చుకోవాలని సవాల్ కూడా విసిరారు. మొత్తం మీద ఈ రెండు పార్టీల మిత్రబంధం దాదాపుగా తెగిపోయినట్లేనన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. నిన్న మొన్నటి దాకా శివసేన విమర్శలను విని భరిస్తూ వచ్చిన బీజేపీ ఇక లాభం లేదనుకుని బైబై చెప్పేందుకు రెడీ అయింది.