కావ‌లిలోనూ బెజ‌వాడ సీన్....! టీడీపీలో అంతేనా?

Update: 2018-02-17 10:30 GMT

నెల్లూరు జిల్లా కావ‌లి మునిసిపాలిటిలోనూ టీడీపీ నేత‌ల మ‌ధ్య అధికార పీఠం త‌గువు ర‌చ్చ‌కెక్కింది. ఇప్ప‌టికే అత్యంత కీల‌క‌మైన విజ‌య‌వాడ మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌లో మేయ‌ర్ ప‌ద‌విపై త‌మ్ముళ్లు త‌గువు ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు కావలి మునిసిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ ప‌ద‌వి కోసం ఇదే త‌ర‌హా త‌గ‌వు ముదురుతోంది. ప్ర‌స్తుతం చైర్‌ప‌ర్స‌న్‌గా ఉన్న టీడీపీ నాయ‌కురాలు.. పోతుగంటి అలేఖ్య .. ఈ ప‌ద‌వి నుంచి దిగేందుకు స‌సేమిరా అన‌డ‌మే కాకుండా.. ఏకంగా మంత్రి నారాయ‌ణ మాట‌ల‌ను సైతం లెక్క‌చేయ‌క‌పోవ‌డం తీవ్ర వివాదానికి కార‌ణ‌మ‌వుతోంది. విష‌యంలోకి వెళ్తే.. 2014లో జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ గెలుపొందింది. దీంతో జ‌న‌ర‌ల్ కోటాలో అలేఖ్య చైర్‌ప‌ర్స‌న్ ప‌ద‌విని దక్కించు కున్నారు. ఈ స‌మ‌యంలో ఈ ప‌ద‌విని ఇద్ద‌రు పంచుకోవాల‌ని పార్టీ అధిష్టానం ముందుగానే నిర్ణ‌యించింది.

కోర్టుకేసుల కారణంగా.....

అంటే తొలి రెండున్న‌రేళ్లు.. అలేఖ్య‌, త‌ర్వాత రెండున్న‌రేళ్లు 27వ వార్డు కౌన్సిలర్‌ గుంటుపల్లి శ్రీదేవి చౌదరి చైర్ ప‌ర్స‌న్లుగా వ్య‌వ‌హ‌రించాల‌ని నిర్ణ‌యించారు. దీనికి ఒప్పుకొన్న అలేఖ్య చైర్‌ప‌ర్స‌న్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టింది. అయితే, ఆమె పీఠం అధిష్ఠించిన కొద్ది రోజులకే విప్‌ ధిక్కారంపై కోర్టు చిక్కులు రావడంతో చాలా కాలం అలేఖ్య పదవికి దూరంగా ఉన్నారు. ఈ సమయంలో బీద మస్తాన్‌రావు, మంత్రి నారాయణ అలేఖ్యకు బాసటగా నిలిచి సుప్రీం కోర్టులో కేసు వేసి పీఠంపై అలేఖ్యను మళ్లీ కూర్చోబెట్టారు. ఆమెకు పదవి రెండున్నరేళ్లు మాత్రమే కావ‌డం, మిగిలిన రెండున్నరేళ్లు 27వ వార్డు కౌన్సిలర్‌ గుంటుపల్లి శ్రీదేవి చౌదరికి అని నిర్ణయించిన నేప‌థ్యంలో ఈ ప‌ద‌వి విష‌యం ఇప్పుడు ర‌గ‌డ‌కు దారి తీసింది. మునిసిపాలిటీ ఎన్నికలు జ‌రిగి అప్పుడే నాలుగేళ్లు గ‌డిచిపోవ‌డం. అప్ప‌టి ఒప్పందం ఇప్ప‌టికీ అమ‌లు కాక‌పోవ‌డంతో శ్రీదేవి ఇప్పుడు పెద్ద ఎత్తున ఒత్తిడి పెంచుతున్నారు.

తనకివ్వాలంటున్న శ్రీదేవి.....

ఎన్నిక‌ల‌కు సంవత్సరమే ఉండడంతో అనుకున్నట్లు తనకు పదవి ఇవ్వాలని శ్రీదేవి చౌదరి, ఆమె భర్త రాజ్‌కుమార్ చౌదరి ఒత్తిడి చేస్తున్నారు. ఈ మేరకు అలేఖ్య తప్పుకోవాలని కొద్ది రోజులుగా పార్టీ పెద్దలు సూచిస్తున్నారు. గతంలో మధ్యవర్తిత్వం చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు, అలేఖ్య, ఆమె తండ్రి గ్రంధి యానాదిశెట్టి, భర్త శ్రీకాంత్‌తో బీద మస్తాన్‌రావు చర్చలు జరిపారు. అయితే, కోర్టు కేసులతో రెండున్నరేళ్లు పదవిలో లేనని పదవి నుంచి ఎలా వైదొలగాలని అలేఖ్య కోరినట్లు సమాచారం. ఇటీవల అలేఖ్య అధ్యక్ష పదవిలో ఉన్నా పార్టీకి ఎలాంటి మైలేజీ రాలేదని, ఈమేరకు పార్టీ జరిపిన అంతర్గత సర్వేలో తేలినట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన పురపాలకశాఖ మంత్రి నారాయణ ఇటీవల అలేఖ్య దంపతులతో మాట్లాడి పదవి నుంచి తప్పుకోవాలని కోరినా ససేమిరా అన్నట్లు తెలిసింది. టీడీపీ పట్టణ నాయకులు ఇటీవ‌ల‌ జరగిన సమావేశంలో కూడా పదవి నుంచి తప్పుకోవాలని సూచించారు. దీనికి అలేఖ్య అంగీకరించలేదు. దీంతో ఈ వివాదం తీవ్ర రూపం దాల్చేలా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి దీనికి చంద్ర‌బాబు ఎలా ప‌రిష్కారం చూపిస్తారో చూడాలి.

Similar News