తమిళనాడులో అన్నా డీఎంకే సర్కార్ తీవ్ర వత్తిడిని ఎదుర్కొంటోంది. కావేరి జలాల కేటాయింపులో ఇప్పటికే అన్యాయం జరిగిందని ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఇందులో విపక్ష పార్టీలు ప్రధాన పాత్ర పోషించాయనే చెప్పక తప్పదు. కావేరి నీటి పంపిణీలో తమిళనాడుకు అన్యాయం జరిగిందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. 120 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదానికి తెరపడుతుందేమోనని అందరూ భావించారు. అయితే సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. ఈ తీర్పు ప్రకారం ఏ రాష్ట్రానికి కావేరీ నదిపై పూర్తి అధికారం కాని హక్కులు గాని లేవని స్పష్టం చేసింది..
మండలి ఏర్పాటుకు గడువు పూర్తి....
అంతేకాదు కావేరీ జలాల పంపిణీని కూడా సుప్రీంకోర్టు నిర్ధారించింది. కావేరీ జలాల్లో 177.25 టీఎంసీలను తమిళనాడుకు విడుదల చేయాలని స్సష్టం చేసింది. అయితే గతంలో తమిళనాడుకు 192 టీఎంసీల నీటి పంపిణీజరిగేది. దాదాపు 15 టీఎంసీలు తమిళనాడుకు తగ్గింది. దీనిపై తమిళనాడు అప్పట్లో భగ్గుమంది. అయితే ఈనెల 29వ తేదీలోగా కావేరీ జల వివాదాలను పరిష్కరించేందుకు, నీటి పంపిణీకి కావేరీ యాజమాన్య మండలిని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈరోజుతో సుప్రీంకోర్టు మండలి ఏర్పాటు చేయమన్న గడువు పూర్తయింది.
అందుకే ఆందోళనలు....
అందుకే అన్నాడీఎంకే పార్లమెంటు సభ్యులు గత పది రోజులుగా పార్లమెంటులో ఇదే డిమాండ్ తో సభను స్థంభింప చేస్తున్నారు. ఇప్పటికే కావేరి యాజమాన్య మండలి ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. కర్ణాటక ఎన్నికలు ఉండటంతోనే కేంద్ర ప్రభుత్వం యాజమాన్య మండలి ఏర్పాటు పై మీనమేషాలు లెక్కిస్తుందన్నది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేను ఇరుకున పెట్టేందుకు డీఎంకేతో పాటు టీటీవీ దినకరన్ కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కావేరీ యాజమాన్య మండలి ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందన్న ప్రచారం జోరుగా చేస్తున్నారు.
సుప్రీంకోర్టుకు వెళ్లాలని.....
అయితే కేంద్రప్రభుత్వంపై తాము వత్తిడి తెచ్చేందుకే గత కొన్ని రోజులుగా తమ పార్టీ ఎంపీలు ప్రయత్నిస్తున్నారని అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. అయితే ప్రజల్లో బలంగా వెళ్లిన కావేరీ జలాల విషయంలో వెనక్కు తగ్గకూడదని ముఖ్యమంత్రి పళనిస్వామి నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మండలి ఏర్పాటుపై స్పష్టత రాకుంటే ఈ నెల 31వ తేదీన రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టులో కోర్టు థిక్కారణ పిటీషన్ వేయాలని నిర్ణయించింది. ఒక పక్క పార్లమెంటులో ఆందోళనలు చేస్తూనే, మరోవైపు న్యాయపోరాటం చేయాలని పళనిస్వామి నిర్ణయించారు. దీంతో ఇక సోమవారం నుంచి కూడా పార్లమెంటు సమావేశాలు సవ్యంగా జరిగే అవకాశాలు లేనట్లే కన్పిస్తున్నాయి. అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందన్నది అనుమానమే. ఎందుకంటే అన్నాడీఎంకే పార్లమెంటులో పోరు కొనసాగించాలని నిర్ణయించింది.