కాలయాపనతో కేంద్రం దొంగాట

Update: 2018-03-06 04:30 GMT

రెవెన్యూ లోటు పూర్తిగా ఇవ్వరట. కేవలం 1600 కోట్లు మాత్రమే ఇస్తారట. ప్రత్యేక ప్యాకేజీ కింద ఈఏపీ ద్వారా ఇవ్వాల్సిన నిధులపై తర్వలో చర్చిస్తారట. పారిశ్రామిక రాయితీలపై కూడా వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభుతో చర్చించాల్సి ఉందట. ప్రత్యేక హోదాపై మరోసారి మాట్లాడుకోవాలట. ఇదీ అరుణ్ జైట్లీ తీరు. అరుణ్ జైట్లీతో తెలుగుదేశం పార్టీ నేతలు జరిపిన చర్చలు ఫలప్రదం కాలేదు. జైట్లీ మాటలు వింటుంటే కేంద్రం తాను అనుకున్న రీతిలోనే వెళుతున్నట్లు అర్థమవుతుంది.

స్పష్టత నివ్వని జైట్లీ....

రెవెన్యూ లోటును వారు 1600 కోట్లుగానే భావిస్తున్నారు. అయితే ఏపీ సర్కార్ మాత్రం 16వేల కోట్లు అంటుంది. కాదు...కాదు 1600 కోట్లు మాత్రమే ఇస్తామని అరుణ‌్ జైట్లీ తేల్చేశారు. ఇలా చర్చలు అసంపూర్తిగా ముగియడం, మరోసారి మాట్లాడుకుందాం అని తేల్చేయడంతో తెలుగుదేశం ఈరోజు పార్లమెంటు సమావేశాల్లోనూ ఆందోళన చేయాలని నిర్ణయించుకుంది. కేంద్రప్రభుత్వం పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకూ చర్చల పేరుతో డ్రామాలాడుతుందన్న భావన కూడా టీడీపీ నేతల్లో వ్యక్త మవుతోంది.

చంద్రబాబు సీరియస్....

ముఖ్యమంత్రి చంద్రబాబుకూడా కేంద్రం వైఖరి పట్ల సీరియస్ అయినట్లు తెలుస్తోంది. మాట్లాడుకుందాం రమ్మని పిలిచి ఎటువంటి హామీలు ఇవ్వకుండా చర్చలు సాగదీయడంపై చంద్రబాబు ఫైర్ అయినట్లు తెలిసింది. ఇప్పటికే దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నింటికీ చంద్రబాబు స్వయంగా రాసిన లేఖలను టీడీపీ ఎంపీలు అందజేశారు. ఏపీకి కేంద్రం చేసిన అన్యాయాన్ని వివరించడంతోపాటు, హామీలు అమలుకాకపోవడాన్ని చంద్రబాబు ఈలేఖలో ప్రస్తావించారు.

నేడూ పార్లమెంటులో ఆందోళనలు.....

చర్చలు కొలిక్కి రాకపోవడంతో నేడు కూడా పార్లమెంటులో టీడీపీ ఆందోళనకు దిగనుంది. టీడీపీ పార్లమెంటు సభ్యులతో టెలికాన్ఫరెన్స్ చేసిన చంద్రబాబు పార్లమెంటు లోపల, బయట ఆందోళనలు చేయాలని తెలిపారు. అలాగే సభ కార్యక్రమాలను స్థంభింప చేయాలని ఆదేశించారు. కేంద్రం దిగివచ్చి పార్లమెంటు సాక్షిగా ప్రకటన చేసేంత వరకూ పోరాడాల్సిందేనన్నారు. అప్పటి వరకూ చర్చలు చేస్తూనే ఆందోళనలను కొనసాగించాలని ఆయన సూచించారు.

Similar News