పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ జె ఎఫ్ సి కాలయాపన చేస్తూ బాబు సర్కార్ పై వస్తున్న వ్యతిరేకత చల్లార్చడానికి అన్న విమర్శలు పొలిటికల్ సర్కిల్స్ లో ముఖ్యంగా వైసిపి వర్గాల నుంచి వినవస్తున్నాయి. కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్రం ఖర్చు పెట్టిన తీరు అందరికి తెలుసనీ అలాగే విభజన హామీలు ఏవి అమలు కాలేదని ప్రజలకు తెలిశాకా ఇక పవన్ నిజ నిర్ధారణ, సత్యాన్వేషణ అనవసర ప్రయాసా కాలయాపన అన్నది వారి అభిప్రాయం. ఏపీ ప్రజలకు తానేదో మంచి చేయడానికి ఈ ప్రయత్నం చేస్తున్నట్లు కనపడేందుకే ఆయన కొత్త డ్రామాకు తెరతీశారని ఇదంతా బాబు సర్కార్ ఆడిస్తున్న నాటకమన్న విమర్శలు సోషల్ మీడియా లో కూడా వెల్లువెత్తుతున్నాయి.
బాబు సర్కార్ ను వెనకేసుకు వస్తున్నారా ...?
నిజనిర్ధారణ కమిటీలో చంద్రబాబు సర్కార్ ను డాక్టర్ జయప్రకాశ్ నారాయణ వెనకేసుకు వస్తున్నట్లే ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని బిజెపి వర్గాలు అంటున్నాయి. కేంద్రానికి నిధులు ఇవ్వడమే బాధ్యత తప్ప రాష్ట్రం ఆ డబ్బు దేనికి ఖర్చు చేసినా వారికి సమాధానం చెప్పాలిసిన అవసరం లేదని సమాఖ్య స్ఫూర్తికి ఇది విరుద్ధమన్నారు జయప్రకాశ్. గత 70 ఏళ్లుగా ఈ తరహా లెక్కలు కేంద్రం రాష్ట్రాలను అడగలేదని మోడీ సర్కార్ ఇలా అడగటం విడ్డూరమనే తీరున వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలే ఇప్పుడు బిజెపి వర్గాలు, సోషల్ మీడియా లో కొందరు నెటిజెన్లు తప్పుపడుతున్నారు. ఏ ఖర్చు కోసం ఇచ్చారో ఆ ఖర్చు ఏపీ సర్కార్ చేయలేదన్నది జెపి చేసిన వ్యాఖ్యలే చెప్పక చెబుతున్నాయని ఎన్ని నిధులు ఇచ్చినా పక్కదారి పట్టించి వేరే వాటికి ఉపయోగించి కేంద్రం ఏమి చేయడం లేదని ప్రజల్లో టిడిపి తప్పుడు సంకేతాలు పంపుతుందని బిజెపి వర్గాలు మండి పడుతున్నాయి. నిజనిర్ధారణ చేయకుండా రాజకీయాలే పికె టీం చేస్తుందని ఇది బాబు వెనుక నుంచి నడుపుతున్న డ్రామా నే అంటున్నారు కొందరు.
కేంద్రమే టార్గెట్ గా ...
నిజనిర్ధారణ కమిటీ కేంద్ర ప్రభుత్వ తప్పులని ఎత్తి చూపి మోడీ సర్కార్ పై యుద్హానికి సిద్ధం అవుతుంది. తాము తేల్చిన లెక్కలతో రాష్ట్ర ప్రభుత్వం తో చర్చించి, ఆ తరువాత కేంద్రంలోని మంత్రులను, ప్రధానిని కలవాలని భావిస్తుంది. తద్వారా ఏపీ కి రావాలిసిన నిధులు లాబీయింగ్ ద్వారా సాధించే అవకాశం ఉందని ప్రాధమికంగా డాక్టర్ జయప్రకాష్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
పోరాటామే అంటున్న వామపక్షాలు ...
ఏపీకి న్యాయం జరగాలంటే పోరాటమే శరణ్యమని నిజనిర్ధారణ కమిటీ సమావేశంలో పాల్గొన్న వామపక్షాలు స్పష్టం చేశాయి. ఢిల్లీ కేంద్రంగా ఉద్యమాన్ని నిర్మించాలని కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులుగా సమావేశంలో పాల్గొన్న మధు, రామకృష్ణలు స్పష్టం చేశారు. నాలుగేళ్లుగా ఏపీ సర్కార్ నిజాలు దాచిపెట్టిందని, కేంద్రం విభజన హామీలు ఒక్కటి అమలు చేయకపోయినా నోరెత్తక ఇప్పుడు మాట్లాడటాన్ని కమ్యూనిస్ట్ ప్రతినిధులు తీవ్రంగా తప్పు పట్టారు. ఏపీకి అన్యాయం జరగకుండా అన్ని పక్షాలను కలుపుకుని వెళ్ళి పోరాడాలన్న అభిమతాన్ని వారు వ్యక్తం చేశారు.