పేరుకి చిన్న జట్టే అయినా జగజ్జేతలకే సవాల్ విసురుతుంది బాంగ్లాదేశ్. ఆదివారం శ్రీలంకలో జరిగిన ముక్కోణపు ఫైనల్ లో అదే జరిగింది. టాస్ ఒడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లా అనూహ్య ఆటతీరుతో ప్రత్యర్థి భారత్ ముందు గట్టి స్కోర్ పెట్టి సమరానికి సై అంది. పసికూనే కదా అని గతంలో చేసిన నిర్లక్ష్యం ఒక టర్మ్ భారత్ ను ప్రపంచకప్ లో సెమిస్ కూడా చేరకుండా చేసిన బంగ్లా పై ఆచితూచి ఆడింది టీం ఇండియా. అయినా ఫైనల్ ఓవర్లకు వచ్చే సరికి ఓటమి ఖరారు అయిందనే అనుకున్నారు అంతా. కానీ చిచ్చర పిడుగులా దినేష్ కార్తిక్ బంగ్లా చేతికందిన కప్ ను తన కళ్లుచెదిరే సిక్సర్ తో భారత్ పరం చేసేశాడు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ లో విజయానికి పరాజయానికి ఇరుజట్ల నడుమ చివరిబాల్ కీలకంగా మారింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్ లో రెండు టీం లు సమఉజ్జీలుగా తలపడ్డాయి. అయితే అదృష్టం టీం ఇండియా పక్షాన నిలవడంతో మరో చారిత్రాత్మక విజయంతో బాటు ముక్కోణపు సిరీస్ రోహిత్ పరం అయ్యాయి.
టాస్ గెలిచి ...
పదునైన బ్యాటింగ్ బలాన్ని నమ్ముకున్న టీం ఇండియా ముక్కోణపు సిరీస్ ఫైనల్ లో టాస్ గెలిచి ప్రత్యర్థి బాంగ్లాదేశ్ కి బ్యాటింగ్ అప్పగించింది. ఛేదనే తమకు మేలుగా భావించిన రోహిత్ తీసుకున్న ఆ నిర్ణయం సత్ఫలితాన్నే అందించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బాంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 166 పరుగులు సాధించింది. బంగ్లా ఆటగాళ్లలో షబ్బీర్ రహమాన్ 50 బంతుల్లో 7 ఫోర్లు నాలుగు సిక్సర్లతో 77 పరుగులు చేసి టీం టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక భారత్ బౌలింగ్ లో స్పిన్నర్లు ప్రత్యర్థిని బాగా కట్టడి చేసినా పేసర్లు మాత్రం ధారాళంగా పరుగులు ఇచ్చేశారు. చాహల్ (3 / 18 ) సుందర్ ( 1/20 ) అద్భుతంగా రాణిస్తే పేసర్లు, విజయశంకర్ (0/40), ఠాకూర్ (0/45) పరుగులు సమర్పించుకుని బంగ్లా భారీ స్కోర్ కి ఆస్కారం కల్పించారు.
ఆదుకున్న రోహిత్ ...
ఫామ్ లో వున్న ధావన్ 10, రైనా 0 తో వెనుతిరిగినా కెప్టెన్ రోహిత్ టీం విజయానికి బాటలు వేశాడు. రాహుల్ తో కలిసి మూడో వికెట్ కి 50 పరుగుల అమూల్య భాగస్వామ్యం నెలకొల్పడంతో బాటు 14 వ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. రోహిత్ రాహుల్ వెనుతిరిగాక టీం ఇండియా కు రన్ రేట్ పెరుగుతూ పోయింది. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ లో వచ్చిన విజయశంకర్ జిడ్డు ఆటతో బంతులు తరిగిపోతూ లక్ష్యం చుక్కలు చూసేలా మారింది. మనీష్ పాండే ఒక పక్క ధాటిగా ఆడుతున్నా మరోపక్క విజయశంకర్ ఆట తీరుతో కప్ బంగ్లా పరం అయ్యిందనే అంతా భావించారు.
బ్యాటింగ్ మెరుపులతో మ్యాచ్ ను మలుపు తిప్పిన కార్తీక్ ...
బాగా ఆడుతున్న పాండేను 18 ఓవర్లో ఒక్క పరుగే ఇచ్చి ముస్తా ఫిజుర్ పెవిలియన్ చేర్చాడు. ఆ దశలో 12 బంతుల్లో 34 పరుగులు సాధించాలిసిన పరిస్థితి. ఒక పక్క చాలా దారుణంగా ఆడుతున్న విజయశంకర్. ఇక టీం ఇండియా ఫ్యాన్స్ ఆశలు వదిలేసుకున్నారు. కానీ క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తిక్ పోరాటమే ఊపిరిగా బ్యాట్ తో బంతిని ఆడేసుకున్నాడు. 19 ఓవర్లో ఏకంగా రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో భారత్ ఆశలు సజీవం చేశాడు. దాంతో చివరి ఓవర్ కి భారత్ 12 పరుగులు చేస్తే లక్ష్యం చేరుకునే స్థితికి వచ్చింది. ఇక చివరి ఓవర్ లో ఒక్క బంతికి ఐదు పరుగులు చేయాలిసిన స్థితిలో వున్న టీం ఇండియా కి తన సిక్సర్ తో అనూహ్య విజయాన్ని అందించాడు దినేష్ కార్తిక్. సౌమ్య సర్కార్ అప్పటివరకు యార్కర్ లెంగ్త్ బంతులు విసిరితే చివరి బాల్ లెంగ్త్ బాల్ విసరడంతో కవర్స్ మీదుగా కార్తీక్ కళ్ళు చెదిరే సిక్స్ కొట్టి మ్యాచ్ ను నీదహస్ కప్ ను తెచ్చిపెట్టాడు. అసాధ్యమనుకున్న ఇండియా విజయాన్ని 8 బంతుల్లో 29 పరుగులు సాధించి సుసాధ్యం చేసిన దినేష్ కార్తిక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ను అందుకున్నాడు.