కార్డు మనీ ఖర్చు పెట్టే వారికి కేంద్ర ప్రభుత్వం ఓ శుభవార్తను ప్రకటించింది. నగదు లావాదేవీలకు చెల్లించవలసి వచ్చే మొత్తాన్నే, డెబిట్ కార్డు ద్వారా చెల్లించేట్లయితే కొన్ని సుంకాలు ఇప్పటిదాకా అమల్లో ఉన్న సంగతి అందరికీ తెలిసినదే. అందుకే ప్రజలు ఖాతాల్లో డబ్బులు, డెబిట్ కార్డుల అలవాటు ఉన్న నగరజీవులు కూడా.. వాటి వాడకానికి మాత్రం ఇష్టపడడం లేదు. దుకాణాల్లో 2 శాతం అదనంగా వసూలు చేస్తున్నారని వాడడం లేదు. ఈ నేపథ్యంలో డెబిట్ కార్డుల ద్వారా జరిపే అన్ని లావాదేవీలపై అన్ని రకాల రుసుములను ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ ప్రకటించారు. ఈ-వాలెట్ లలో కూడా నగదు పరిమితిని పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇకపై డెబిట్ కార్డుల లావాదేవీలపై సర్వీస్ చార్జీలు ఉండవు.
అలాగే ఐఆర్ సీటీసీ రైల్వే బుకింగ్ మీద విధించే రుసుములను కూడా ఈనెలాఖరు వరకు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. సహకార రంగంలోని బ్యాంకులకు కూడా ఇబ్బంది లేదని, అక్కడ అవసరమైనంత సొమ్ము ఉన్నదని చెప్పారు. కొత్తగా 21 వేల కోట్ల నగదును సహకార రంగంలోని బ్యాంకులకు పంపినట్లు వెల్లడించారు. లక్షా55 వేల పోస్టాఫీసుల్లో కొత్తనోట్లు అందుబాటులో ఉన్నాయంటూ దాస్ వెల్లడించారు.
మొత్తానికి ప్రజల కష్టాలను తొలగించడంతో పాటూ, వారి దైనందిన జీవితంలో కార్డు లావాదేవీలు, ప్లాస్టిక్ మనీ వినియోగం అనేవి వారికి అలవాటు చేసే దిశగా ప్రభుత్వం పావులు కదుపుతున్ట్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు సంక్షోభం ఉన్నప్పుడు సుంకాలు ఎత్తివేసి మళ్లీ వడ్డించడం కాకుండా, ఎప్పటికీ.. ఇలాంటి ఔచిత్యం లేని సర్వీస్ ట్యాక్సులను రద్దు చేసేస్తేనే.. ప్రజల్లో కార్డు మనీ వినియోగం పెరుగుతుంది. లేకపోతే మళ్లీ యథాపూర్వ పరిస్థితి వస్తుంది.