’కార్డు‘ డబ్బు వాడితే.. వరాల వెల్లువ

Update: 2016-12-08 12:53 GMT

డిజిటల్ మనీ వినియోగం దిశగా భారతదేశ ప్రజలను ప్రోత్సహించే చర్యలకు కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు వాడే వారికి, ఆన్ లైన్ లావాదేవీలు చేసే వారికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కొన్ని వరాలను ప్రకటించారు. దేశం ఇప్పుడిప్పుడే నగదు రహిత లావాదేవీల వైపు కదులుతున్నదని జైట్లీ ప్రకటించారు. దేశం మొత్తం డిజిటల్ మనీ వినియోగం వైపు మళ్లవలసిన అవసరం ఉన్నదని జైట్లీ పిలుపు ఇచ్చారు.

డిజిటల్ లావాదేవీలు 20 నుంచి 40 శాతానికి పెరిగాయని ఆయన వెల్లడించారు. ప్రజలు ఆన్‌లైన్ లావాదేవీల పట్ల స్వచ్చందంగా మొగ్గు చూపడానికి వీలుగా కేంద్రం తరఫున చేస్తున్న ఏర్పాట్లను, వినియోగించే వారికి కల్పిస్తున్న రాయితీలను గురించి అరుణ్ జైట్లీ వివరించారు.

- కార్డు ద్వారా పెట్రోలు బంకుల్లో చెల్లించే వారికి 0.7 శాతం రాయితీ లభిస్తుంది.

- ఆన్ లైన్ ద్వారా లేదా కార్డు ద్వారా కొనే వారికి రైల్వేపాసుల రేట్లు తగ్గింపు లభిస్తుంది.

- కిసాన్ క్రెడిట్ కార్డులు ఉన్న వారందరికీ రూపే కార్డులు అందజేస్తారు.

- ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసే ఇన్సూరెన్సు పాలసీలు అన్నింటికీ పదిశాతం తగ్గింపు వర్తిస్తుంది.

- ఐఆర్‌సీటీసీ ద్వారా ఆన్‌లైన్ లో రైలు టికెట్లు కొనుగోలు చేసే వారికి పదిలక్షల రూపాయల బీమా వర్తిస్తుంది.

- ఆన్‌లైన్ ద్వారా చెల్లించే ఎల్‌ఐసీల పాలసీలపై 8 శాతం ప్రీమియం తగ్గింపు వర్తిస్తుంది.

- 10 వేల జనాభా గ్రామాలకు పోస్ మెషిన్లు అందజేస్తారు.

- టోల్ గేట్లలో కార్డులతో చెల్లిస్తే పదిశాతం తగ్గిస్తారు.

... మొత్తానికి ప్రజలే స్వచ్ఛందంగా డిజిటల్ మనీ వినియోగం వైపు మళ్లేలా ప్రభుత్వం తనంతగా కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ , తాయిలాలు ప్రకటించి మంచిపనే చేసిందనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. దీనివల్ల.. ప్రజల్లో ఆవేశం అయినా కొంతమేర తగ్గుతుందని, క్రమంగా డిజిటల్ మనీ వినియోగం ఇంకా పెరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Similar News