అమెరికా నుంచి ఎక్కువ మంది పౌరులు ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించి ఇక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశాలను కల్పించేందుకు తాను సహకరిస్తానని హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులెట్ జనరల్ కేథరిన్ హడ్డా ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్-అమెరికా మధ్య మెరుగైన సత్సంబంధాలు కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును మంగళవారం మధ్యాహ్నం ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు.
భవిష్యత్తు తరాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక లక్ష్యం నిర్థేశించుకుని అందుకనుగుణంగా చేస్తున్న కృషిని తాను చాలాసార్లు విన్నానని కేథరిన్ హడ్డా తెలిపారు. తన 28ఏళ్ల సర్వీస్‌లో తొలిసారి ఆంధ్రప్రదేశ్ సందర్శించానని ఆమె అన్నారు..
ఆంధ్రప్రదేశ్ ఎంతో అద్భుతమైన రాష్ట్రమని కితాబిచ్చిన ఆమె అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రజా రాజధానిని నిర్మించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానం సాధించటం ఎంతో గొప్ప విషయమని కేథరిన్ హడ్డా ప్రశంసించారు. విశాఖ స్మార్ట్ నగరంగా అభివృద్ధి చేయటంతో పాటు సీఆర్డీఏ ప్రాజెక్టు మేనెజ్మెంట్ కాన్సులేట్ అమెరికా ఆంధ్రప్రదేశ్‌కు అందిస్తున్న సహకారం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ సంప్రదాయాలు, వారసత్వ సంపదను ముఖ్యమంత్రి ఆమెకు వివరించారు. రాష్ట్ర విభజన తమకు ఎన్నో సమస్యలతో పాటు వాటిని అధిగమించే ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందని, రెండున్నరేళ్లలోనే అనేక సమస్యలకు పరిష్కారం కనుగొన్నామని తెలిపారు. వచ్చే పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే మొదటి నగరంగా ఆవిర్భవిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొమ్మిదేళ్ల కాలంలో హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన తీరును సీఎం వివరించారు. రాష్ట్రంలో సుదీర్ఘతీర ప్రాంతం ఉండటంతో పాటు లోతైన పోర్టులు, ఇతర సహజ వనరులను సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తీరును ముఖ్యమంత్రి కేథరిన్ హడ్డాకు వివరించారు.
రాష్ట్ర బలమంతా ఇక్కడ ప్రజలేనన్న సీఎం, ఎక్కువమంది యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకోవటం తమ రాష్ట్రానికున్న గొప్ప అవకాశమని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులోను అమెరికా-ఆంధ్రప్రదేశ్ మీద మరిన్ని మెరుగైన సత్సంబంధాలు కొనసాగుతాయని సీఎం ఆకాంక్షించారు.