ప్రధాని మోడీ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాడిన పదజాలం దుమారం రేపుతోంది. బీజేపీ నేతలు కేసీఆర్ పై మండి పడుతున్నారు. ఇటీవల జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధాని మోడీపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ప్రధానికి కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ వివిధ జిల్లాల్లో కమలనాధులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని పదవికి గౌరవం ఇవ్వలేని కేసీఆర్ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళతారని వారు ప్రశ్నిస్తున్నారు.
తనను బాధించాయన్న నిర్మల......
ఇక కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సయితం ప్రధానిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కేసీఆర్ వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు నిర్మలా సీతారామన్. పార్టీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ వర్థంతి సభలో ఆమె మాట్లాడుతూ కేసీఆర్ వ్యాఖ్యలు తనతో పాటు దేశ ప్రజలను కూడా బాధించాయన్నారు. ప్రధానిని కేసీఆర్ ఏకవచనంతో సంభోదించడమే కాకుండా, విమర్శలు చేయడం తగదన్నారు నిర్మలా సీతారామన్.
కేటీఆర్ ను నిలదీశా.....
తాను టాటా బోయింగ్ కంపెనీ కార్యక్రమానికి హాజరుకాకూడదని తొలుత భావించానని, ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ కు తెలిపానన్నారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వల్ల తాను ఈ కార్యక్రమానికి హాజరు కాలేనని చెప్పానన్నారు. తాను కేటీఆర్ ను నిలదీశానన్నారు. మోడీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ కార్యక్రమానికి రావడం బాగుండదని చెప్పానన్నారు నిర్మల. అయితే కేటీఆర్ మాత్రం కేసీఆర్ అలా మాట్లాడి ఉంటారని తాను అనుకోవడం లేదని చెప్పారన్నారు. సిద్ధాంతపరంగా, విధానాల పరంగా విమర్శలు చేస్తే బాగుంటుందని, వ్యక్తిగత దూషణలకు దిగితే ఊరుకునేది లేదని నిర్మల హెచ్చరించారు. మొత్తం మీద మోడీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి.