రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. నేతలకు పార్టీ ఏదైనా అధికారమే కావాలి. పార్టీలకు కూడా నేతలు ఎవరైనా.. అధికారంలోకి రావాలి. ఇప్పుడు అటు ఏపీ, ఇటు తెలంగాణలోనూ రంజుగా సాగుతున్న ప్రక్రియ ఇదే. విపక్షాలను కూలదోయడం ద్వారా గెలుపును ఆహ్వానించాలని అధికార పార్టీ అదినేతలు రచిస్తున్న వ్యూహాలకు ప్రతిపక్షాలు నిలువెల్లా ఒణికి పోతున్నాయి. ఏపీలో ఇప్పటికే 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు జంప్ చేసేశారు. ఇక, తెలంగాణలోనూ అధికార టీఆర్ ఎస్ ప్రధాన విపక్షం కాంగ్రెస్‌ను ఎంత మేరకు దెబ్బతీయాలో అంతా చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమకు పోటీ వస్తుందని భావిస్తున్న కాంగ్రెస్‌ను తుదకంటా తెగనరికేందుకు కూడా కేసీఆర్ వ్యూహం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నుంచి ఎంపీ గుత్తా వంటి కీలక నేతలకు సైతం గేలం వేశారు.
దానం దారి అటేనా?
ఈ క్రమంలోనే గత కొన్నాళ్లుగా టీఆర్ ఎస్ ప్రభుత్వం చేస్తున్న చర్చలు ఫలించి.. ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ నేతలు త్వరలోనే టీఆర్ ఎస్ గూటికి వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. హైదరాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా, మాజీ కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన దానం నాగేందర్ పై గత కొంతకాలంగా పార్టీ మారతారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయాన్ని దానం ఇప్పటి వరకు ఖండించలేదు. కానీ, పీసీసీ అధ్యక్షుడుగా ఉత్తమ్ మాత్రం పలు సందర్భాల్లో దానం వెళ్లరంటూ ఆయన తరఫున వకాల్తా పుచ్చుకుని మా్ట్టాడారు. ఇక, గత రెండున్నరేళ్లుగా కూడా దానం నాగేందర్ మౌనంగానే ఉంటున్నారు. పార్టీలోనే ఉన్నా కీలకంగా ఎలాంటి కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదు.
రాపోలు కూడానా?
ఇక, మరో నేత, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ కూడా పార్టీలోనే ఉంటున్నా.. ఆయన మనసంతా కేసీఆర్ చుట్టూతానే తిరుగుతోందని ఆరోపణలు వచ్చాయి. అయితే. . హైప్రొఫైల్ మెయిన్ టెన్ చేసే.. రాపోలు... మీడియా ముందుకు రావడం కానీ, ఈ వ్యాఖ్యలను ఖండించడం కానీ చేయలేదు. దీంతో ఈయన కూడా పార్టీ మారతారనే విషయం గుంభనంగానే ఉంది. తాజాగా గణతంత్ర వేడుకల సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఇచ్చిన విందుకు అన్ని పార్టీల నేతలను ఆహ్వానించారు. అయితే, కాంగ్రెస్ మాత్రం.. ఇటీవల తమను గవర్నర్ అవమానించారనే కారణంగా ఈ విందును బహిష్కరించాలని పీసీసీ పిలుపునిచ్చింది. అయితే, అనూహ్యంగా గవర్నర్ ఇచ్చిన విందుకు అటు దానం నాగేందర్, ఇటు రాపోలు ఇద్దరూ హాజరయ్యారు. అంతేకాదు, అధికార పార్టీ నేతలు కూర్చున్న వైపే కూర్చోవడం కూడా సంచలనం రేపింది. దీంతో ఇక, త్వరలోనే వీరిద్దరూ పార్టీ మారడం ఖాయమనే వ్యాఖ్యలకు బలం చేకూరిందని అంటున్నారు విశ్లేషకులు. సో.. ముహూర్తమే తరువాయి అన్నమాట!!