సీఎల్పీ నేత జానారెడ్డిని సభ నుంచిసస్పెండ్ చేయడం వివాదంగా మారింది. నిన్న గవర్నర్ ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ సభ్యులందరూ నిరసనను వ్యక్తం చేస్తున్నా జానారెడ్డి సభలో మౌనంగానే ఉన్నారు. అయినా జానారెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జానారెడ్డి శాససభలో సీనియర్ నేత ఆయన జానారెడ్డి గతంలోనూ అనేక పదవులు నిర్వహించారు. ఆయన సభలో ఎప్పుడూ హుందాగా ఉంటారని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేకసార్లు ప్రశంసించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇందుకు కాంగ్రెస్ ప్రతివ్యూహాన్ని రచించినట్లు సమాచారం. మూకుమ్మడి రాజీనామాలు చేసి కేసీఆర్ ఎత్తుకు పైఎత్తు వేయాలన్నది కాంగ్రెస్ నేతల ఉద్దేశం.
జానా సస్పెన్షన్ పై అభ్యంతరాలు....
అయితే జానారెడ్డిని సస్పెండ్ చేయడాన్ని ఇతర పార్టీలు కూడా తప్పుపడుతున్నాయి. బీజేపీ శాసనసభ పక్ష నేత కిషన్ రెడ్డి కూడా జానారెడ్డిని సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు. ఆయన ఏనాడూ సభలో నినాదాలు చేయలేదని కిషన్ రెడ్డి చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిపైన చర్యలు తీసుకునేముందు అన్ని పక్షాలతో మాట్లాడాల్సి ఉండాల్సి ఉందన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానమిస్తూ జానారెడ్డి అంటే తనకు గౌరవముందని, ఆయనను నాలుగేళ్లుగా పెద్దలు జానారెడ్డి అని తాను సంభోదిస్తూ వచ్చానన్నారు. అయితే వీడియో ఫుటేజీ ఆధారంగా చర్యలు తీసుకున్నామని కేసీఆర్ చెప్పారు.
సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్.....
సీనియర్ నేత జానారెడ్డి సస్పెన్షన్ వ్యవహారంపై అధికార పార్టీ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. జానారెడ్డి సస్పెన్షన్ ను బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. జానారెడ్డి సస్పెన్షన్ చేయడంపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఉంది. మూకుమ్మడి రాజీనామాలు చేసే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం. శాసనసభ నుంచి అకారణంగా సస్పెన్షన్ చేశారని రాజీనామాలు చేసి ప్రజలకు వెళ్లాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా ఉంది. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ ల శాసనసభ్యత్వాలు రద్దు చేయడంతో మూకుమ్మడి రాజీనామాలు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. హైకమాండ్ తో చర్చించిన తర్వాత దీనిపై నిర్ణయం ప్రకటించే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.