కాంగ్రెస్ భూవితరణలపై చంద్రబాబు కొరడా!

Update: 2016-10-18 16:37 GMT

నిజానికి చంద్రబాబు నాయుడు సర్కారు మదిలో ఈ ఎజెండా అంశం చాలాకాలంగా మెదలుతూనే ఉన్నది. పలు సందర్భాల్లో ప్రస్తావనకు కూడా వచ్చింది. అయితే ఇప్పుడు కేబినెట్ భేటీ సాక్షిగా దీనికి సంబంధించి.. ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వాల హయాంలో పరిశ్రమల స్థాపన పేరిట ప్రభుత్వ స్థలాలు తీసుకుని ఇప్పటిదాకా పరిశ్రమలు ప్రారంభించని సంస్థలకు నోటీసులు ఇవ్వాలని, వారినుంచి స్థలాలను వెనక్కు తీసుకోవాలని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయించింది.

అలాగే చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ భేటీలో నకిలీ విత్తనాల నియంత్రణ గురించి సుదీర్ఘంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. నకిలీ విత్తనాల తయారీదార్ల మీద పీడీయాక్టు ప్రయోగించాలని చంద్రబాబు పురమాయించినట్లు తెలుస్తోంది. అవసరమైతే దీనికి కావాల్సిన చట్ట సవరణలు కూడా చేయాలని సూచించినట్లు సమాచారం. అలాగే.. పరారీలో ఉన్న నకిలీ విత్తన తయారీదార్ల ఫోటోలను పత్రికల్లో ప్రకటించి మరీ వారిని పట్టుకోవడానికి ప్రయత్నించాలని సర్కారు భావిస్తోంది.

దాదాపుగా ప్రతి సమావేశంలోనూ కొన్ని సంస్థలకు భూవితరణ అనేది ఒక ఎజెండాగా పాటిస్తూ ఉండే కేబినెట్.. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన భూములను వెనక్కు లాక్కోవడం మీద దృష్టి పెట్టడం విశేషం. సంస్థలు స్థాపించని వారందరికీ నోటీసులు ఇచ్చి వెనక్కు తీసుకోవాలని అనుకుంటున్నారు. కనీసం ఇలాంటి కఠిన చర్యలు అయినా.. వేగంగా ఏపీలో పారిశ్రామికీకరణ జరగడానికి దారితీస్తే అదే పదివేలని ప్రజలు భావిస్తున్నారు.

Similar News