కాంగ్రెస్ బతికేందుకు ఇలా

Update: 2018-03-01 00:30 GMT

విభజించిన పాపాన్ని కాంగ్రెస్ కడుక్కునే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రాన్ని విభజించడంతో కాంగ్రెస్ కు ఆంధ్రప్రదేశ్ లో స్థానం లేకుండా చేశారు ప్రజలు. ఇచ్చిన రాష్ట్రంలో సయితం అధికారం ఇవ్వలేదు. దీంతో ఏపీలో ఎలాగైనా ఈసారి అసెంబ్లీలోకి కాలుమోపాలన్నది కాంగ్రెస్ ప్రయత్నం. అందుకోసం విభజన చట్టంలోని హామీలను అమలు పర్చాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆందోళనలను ఉధృతం చేస్తోంది. కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు, కాగడాల ప్రదర్శనలతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కాంగ్రెస్ ను బతికించేందుకు శక్తిమేరకు కృషి చేస్తున్నారు.

వైసీపీతో జట్టుకట్టాలని తొలుత....

అయితే కాంగ్రెస్ క్యాడర్, నేతలతో పాటు ఓటు బ్యాంకు కూడా జగన్ పార్టీ పరం కావడంతో తిరిగ పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. విభజించిన కాంగ్రెస్ ను దరిచేర్చుకునేందుకు ఎవరూ ముందుకు రారు. తొలుత కాంగ్రెస్ వైసీపీకి అనుకూలంగానే ఉంది. కాని జగన్ మాత్రం కాంగ్రెస్ ను దగ్గరకు రానివ్వడం లేదు. రాష్ట్రాన్ని విభజించడమే కాకుండా తాను సొంత పార్టీ పెట్టడానికి కారణమైన కాంగ్రెస్ ను చేర్చుకుంటే ప్రయోజనం ఉండదు. అందుకే జగన్ పార్టీ కాంగ్రెస్ తో దూరంగా మెలుగుతూ వస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా జగన్ ను టార్గెట్ చేయడం మొదలు పెట్టింది.

కమ్యునిస్టులతో కలిసి.....

ఒకపక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ నాయకుడంటూనే జగన్ పై మాత్రం చిర్రుబుర్రులాడుతూనే ఉంది. కాంగ్రెస్ ఒంటరి ప్రయాణం చేయడం కష్టమేనన్న సంగతి ఆ పార్టీ నేతలకూ తెలియంది కాదు. దీంతో కమ్యునిస్టులతో జత కట్టేందుకు సిద్ధమయింది. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో సీపీఐ, సీపీఎం కు కొంత బలం, బలగం ఉండేవి. అయితే ఇది ఒకప్పటి మాట. గత పదేళ్ల కాలంలో వామపక్ష పార్టీలు కూడా ఏపీలో దాదాపు గెలిచే, గెలిపించే స్థాయి నుంచి నామమాత్రంగా మిగిలిపోయాయన్నది యదార్థం. దీంతో కాంగ్రెస్ వామపక్షాలతో కలిసినా పెద్దగా ఉపయోగం ఉండదని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళనల్లో కలిసి కొనసాగుతున్నారు.

ప్రత్యేక హోదా నినాదంతోనే....

అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం అన్ని పార్టీలూ కలిసి కేంద్రంపై పోరాడేందుకు రావాలని పిలుపునిస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన ఆంధ్రుల ఆత్మగౌరవ సభలో మాజీ కేంద్రమంత్రి పళ్లంరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాహుల్ తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైల్ పైనే చేస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. మార్చి మొదటి వారంలో పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. అయితే ప్రత్యేక హోదా కాంగ్రెస్ కు కొద్దిగానైనా ఏపీలో కలిసి వస్తుందా? లేదో? చూడాల్సి ఉంది.

Similar News