తెలంగాణ ఇచ్చేది మేమే తెచ్చేది మేమే .. అంటూ తెలంగాణ ఉద్యమం లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడమే కాదు నిజంగా ఇచ్చారు... తెచ్చారు టి కాంగ్రెస్ నేతలు. కానీ ఏం లాభం వారు అనుకున్నది ఒకటి అయ్యింది మరొకటి. తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ చచ్చుడో అన్న గులాబీ బాస్ మాటలకే ప్రజలు కనెక్ట్ అయ్యి ఓట్లు గుద్దేశారు. దాంతో తెలంగాణ ఇస్తే ఒక రాష్ట్రంలో అయినా అధికారం దక్కుతుందనుకున్న కాంగ్రెస్ కి చేదు అనుభవాలే మిగిలాయి. తెలంగాణతో పాటు ఏపీలో కనీసం సింగల్ డిజిట్ ఆ పార్టీకి లేకుండా ప్రజలు తవ్వి పాతరేశారు. అంతే ఆ తరువాత తెలంగాణాలో ఒకలా ఏపీలో మరోలా కాంగ్రెస్ నేతలు కారుస్తున్న కన్నీళ్లు ఏరులై పారుతున్నాయి.
కేసీఆర్ కృతఘ్నుడు .. ప్రజలు కృతజ్ఞులు అన్న జైపాల్ రెడ్డి ...
యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలను టి కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించి యధావిధిగా సభొకటి పెట్టారు. ఆ సభలో మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి బాధ వర్ణనాతీతం. తెలంగాణ రావడంలో తెరవెనుక మంత్రాంగం నడిపిన జైపాల్ కేసీఆర్ పై నిప్పులే చెరిగారు. కేసీఆర్ కృతఘ్నుడన్నారు. అంతే కాదు ప్రజలు మాత్రం కృతజ్ఞులని ప్రాస కోసం వాడేశారు. కేసీఆర్ మాయ మాటలు నమ్మడం వల్లే కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయిందని సోనియా తెలంగాణ కోసం చేసింది వృధా అయ్యిందన్నారు. జైపాల్ రెడ్డి మాటల వెనుక తెలంగాణ ఇస్తే టిఆర్ ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తా అంటూ కేసీఆర్ పెట్టిన ఆఫర్ మాత్రం జైపాల్ ప్రస్తావించలేదు కానీ వాస్తవానికి గులాబీ బాస్ మోసం చేసింది ఈ విషయంలో ప్రజలను కాదు కాంగ్రెస్ నే అని ఆయన ఇప్పటికి చెప్పుకోలేక పోవడం గమనార్హం.
స్పెషల్ అట్రాక్షన్ రేవంత్ రెడ్డి....
గాంధీ భవన్ కు తొలిసారి అడుగుపెట్టిన రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలింగనం చేసుకుని మరీ స్వాగతం చెప్పారు. రేవంత్ రెడ్డి భారీ ర్యాలీతో గాంధీభవన్ కు చేరుకున్నారు. అందరి కాంగ్రెస్ నేతలతో రేవంత్ కలియ తిరిగారు. తర్వాత జరిగిన సమావేశంలో రేవంత్ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరగాలని కోరారు.