కాంగ్రెస్ నేతలా.. మజాకానా?

Update: 2017-11-02 01:30 GMT

తెలంగాణ కాంగ్రెస్ నేతల రూటే వేరు. ఒకరి మధ్య ఒకరికి సమాచారం ఉండదు. పార్టీలనూ అంతే... అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడూ అంతే. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని సీఎల్పీ భేటీలో నిర్ణయించారు. శాసనసభ, శాసనమండలిలో పార్టీ ఒకే విధమైన వైఖరిని అనుసరించాలని నిర్ణయించాయి. కాని సమావేశంలో అనుకున్నది ఆచరణలో అమలు జరగడం లేదు. శాసనసభలోనూ, మండలిలోనూ ఒకేరకమైన వాయిదా తీర్మానాలు రోజూ ఇవ్వాలన్నది నిర్ణయం. ఈ మేరకు ఒకే వాయిదా తీర్మానాలు ఇస్తూ వస్తున్నారు. కాని శాసనభలో ఒక వైఖరిని, మండలిలో ఒక వైఖరిని అనుసరిస్తున్నారు.

సమన్వయం లేక.....

శాసనసభలో ఫీజు రీఎంబర్స్ మెంట్, టీఎస్పీఎస్సీలో అవినీతిపై కాంగ్రెస్ పార్టీ ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. అయితే శాసనసభలో మాత్రం వాయిదా తీర్మానాన్నిఅనుమతించనందుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు వాకౌట్ చేశారు. కాని మండలిలో మాత్రం అదే వాయిదా తీర్మానంపై మాత్రం వాకౌట్ చేయకుండా సభలోనే ఉండిపోయారు. తర్వాతవిషయం తెలిసి మండలి కాంగ్రెస్ నేతలు నాలుక్కరుచుకున్నారు. వాకౌట్ చేస్తున్నట్లు తమకు కనీసం సమాచారం లేదని మండలిలో కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే ప్రతిరోజూ శాసనసభ సమావేశం అయ్యే గంట ముందు సీఎల్పీ లో మండలి, అసెంబ్లీ సభ్యులు భేటీ అయి ఆరోజు వ్యూహాన్ని రచించుకోవాల్సి ఉంటుంది. కాని ఎవరూ సమావేశానికి రాకపోవడం వల్ల ముఖ్య నేతలే నిర్ణయం తీసుకుని శాసనసభకు వెళుతున్నారు. దీంతో రెండు సభల్లోని నేతల మధ్య సమన్వయం కొరవడింది. దీన్ని చూసి ఇతర పార్టీల నేతలే నవ్వుకుంటున్నారు. దటీజ్ కాంగ్రెస్...!

Similar News