గుజరాత్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ ను భయపెడుతున్నాయా? కాంగ్రెస్ ఈ ఎగ్జిట్ పోల్స్ తో డీలా పడిపోయిందా? రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన తరుణంలో మరో ఓటమి తప్పదని కాంగ్రెస్ పార్టీ దాదాపుగా డిసైడ్ అయిపోయినట్లే కన్పిస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేతలు గుజరాత్ లో సీట్ల సంఖ్య పెరగవచ్చేమో కాని అధికారంలోకి రావడం కష్టమేనని ప్రయివేటు సంభాషణల్లో చెబుతున్నారు. రాహుల్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా హస్తినలో ఉన్న నేతలు గుజరాత్ ఎగ్జిట్ పోల్స్ పైనే ఎక్కువగా ఆరా తీశారు. సీనియర్ నేతలను దీనిపై అడిగి తెలుసుకున్నారు. అయితే ఎక్కువ మంది నేతలు గుజరాత్ తో పాటు హిమాచల్ ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ కష్టకాలమని చెప్పడంతో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలు నిరాశతో వెనుదిరిగారు. ఈ నెల 14వ తేదీన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల చివరి దశ పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ అనంతరం విడుదలయిన అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ బీజేపీకే అనుకూలంగా వచ్చాయి. రెండు రాష్ట్రాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి.
ఈవీఎంలు వద్దు...బ్యాలెట్టే ముద్దు...
అయితే ఇప్పుడు మరో భయం పట్టుకుంది. ఈవీఎంల ట్యాంపరింగ్ సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో జరిగిన స్థానికసంస్థల ఎన్నికల్లో బీజేపీ తర్వాత రెండోస్థానంలో బీఎస్పీ వచ్చింది. అయితే ఈ సందర్భంగా ఆ పార్టీ అధినేత్రి మాయావతి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసినందునే అన్ని రాష్ట్రాల్లో వరుసగా కమలనాధులు విజయం సాధిస్తున్నారన్నది విపక్ష పార్టీల ఆరోపణ. అందుకోసం తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. వచ్చే ఏడాది కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఈవీఎంలు వాడొద్దని, బ్యాలట్ పత్రాలనే వినియోగించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లేఖ రాయడం చూస్తుంటే ఈవీఎంలంటేనే కాంగ్రెస్ పార్టీ భయం పట్టుకుంది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ ప్రజల నాడిని పసిగట్టలేవని, గుజరాత్ లో కాంగ్రెస్ విజయం ఖాయమని అంటున్నారు మరికొందరు కాంగ్రెస్ నేతలు. మొత్తం మీద గుజరాత్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ తర్వాత మరోసారి ఈవీఎంల పై చర్చ నడుస్తోంది.