చేతలు మూరెడు.. ఆశలు బారెడు- తెలుగు నాట బాగా పరిచయమైన సామెత ఇది! తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈ సామెత అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. పదో తరగతి పాసవ్వాలనుకున్న విద్యార్థి.. కనీసం పరీక్షలకు 10 రోజుల ముందునుంచైనా పుస్తకాలు పట్టుకుంటాడు. కానీ, 2019లో ఎన్నికల్లో గెలిచి తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ సహా సీఎం కేసీఆర్‌కు గట్టి ఝలక్ ఇవ్వాలని నిర్ణయించుకున్న టీ-కాంగ్రెస్ నేతలు మాత్రం ఇప్పటికీ ఎలాంటి కార్యాచరణ లేకుండా మాటలతోనే పొద్దుపుచ్చుతున్నారు. ముఖ్యంగా అత్యంత వివాదాస్పద రాజకీయ జిల్లాగా వార్తల్లోకి ఎక్కిన మహబూబ్‌నగర్ విషయంలో టీ-కాంగ్రెస్ నేతలు పెట్టుకున్న ఆశలకు, చేస్తున్న పనులకు ఎలాంటి పొంతనా లేకుండా పొయింది. తాజాగా ఈ జిల్లా గురించి మాట్లాడిన పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలను, 2 ఎంపీ సీట్లను గంపగుత్తగా గెలుచుకుని, కేసీఆర్‌ను గద్దె దింపుడే ఖాయమని మహార్భాటంగా ప్రకటించడం నేతల కార్యశీలతకు పరాకాష్టగా మారింది.
పాలమూరులో ఇదీ పరిస్థితి....
ఈ జిల్లా మొత్తంగా టీఆర్ ఎస్ ప్రభంజనం ఉర్రూతలూగుతోంది. కాంగ్రెస్ చచ్చీచెడీ గత 2014 ఎన్నికల్లో కేవలం నాలుగంటే నాలుగు స్థానాలను మాత్రమే దక్కించుకుని బతుకు జీవుడా అంటూ అస్తిత్వం నిలుపుకోగలిగింది. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఈ నాలుగూ కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు అధికార పార్టీ నేత చేస్తున్న రాజకీయం అంతా ఇంతా కాదు! దీనిని పసిగట్టి తదనుగుణంగా ప్రతివ్యూహం సిద్ధం చేయాల్సిన టీ-కాంగ్రెస్ నేతలు.. తమ పంథాను వీడకుండా ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. జిల్లాలోని మక్తల్, వనపర్తి, గద్వాల్, ఆలంపూర్ నియోజకవర్గాలను గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. మిగిలిన వాటిలో కొడంగల్, నారాయణ పేట్ నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది. అయితే, ప్రస్తుతం కొడంగల్ సీటుకు రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్‌లో చేరారు.
టీఆర్ఎస్ వ్యూహం అమలు....
ఇక, కాంగ్రెస్ గెలిచిన నాలుగు స్థానాల్లోనూ ఇప్పుడు పట్టున్నది కేవలం రెండు చోట్లే! గద్వాల్, ఆలంపూర్ తప్ప మిగిలిన చోట్ల భారీ ఎత్తున టీఆర్ ఎస్ విస్తరించే వ్యూహం అమలవుతోంది. దీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఎక్కడ చూసినా టీఆర్ ఎస్ జెండాలే కనిపిస్తున్నాయి. అలాంటి సమయంలో కాంగ్రెస్ విస్తరించేందుకు ప్రత్యేక వ్యూహం అమలు కావాలి. కానీ, ఆ దిశగా ఎక్కడా అడుగులు పడడం లేదు. కానీ, పీసీసీ చీఫ్‌గా మరోసారి ప్రమోషన్ తెచ్చుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం జిల్లా మొత్తాన్ని వచ్చే ఎన్నికల్లో తామే కైవసం చేసుకుంటామని ప్రకటిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలు గెలుస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వారికి సముచిత స్థానం ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా తనకు ఫోన్ చెయ్యొచ్చన్నారు.
వర్గపోరుతో సతమతం...
కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా ఆదుకుంటానని, తెలంగాణలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తన కుటుంబ సభ్యుడేనని వ్యాఖ్యానించారు. అయితే, మాటల్లో చూపిస్తున్న ఈ ప్రేమ.. చేతల్లో ఎక్కడా కనిపించడం లేదని అంటున్నారు కార్యకర్తలు. దీనికి తోడు.. వర్గ పోరు కూడా పెరిగిపోయింది. దేవరకద్ర నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఓడిపోయిన పవన్ కుమార్ రెడ్డి వర్గం, జైపాల్ రెడ్డి అంటూ రెండు వర్గాలు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం భారీ ఎత్తున తలపడుతున్నారు. ఇక సీనియర్లలో రేవంత్‌కు డీకే అరుణకు పడదు, అరుణకు, జైపాల్‌కు పడదు. ఇలా ప్రతి ఒక్కరికి అందరితోనూ సఖ్యత లేదు. దీంతో ఇలాంటి జిల్లాపై ముందస్తు వ్యూహం అమలు చేయాల్సిన అవసరాన్ని మరిచి.. మాటలతోనే సరిపెడుతుండడం.. ఉట్టికి ఎగరని టీ-కాంగ్రెస్ స్వర్గానికి ఎగురుతానంటే.. ఇలానే ఉంటుంది..! అని కార్యకర్తలే ఎద్దేవా చేస్తున్నారు. మరి సీనియర్లు ఇప్పటికైనా మేల్కొంటారా? లేదా?!