ఇప్పటి వరకూ అధికార టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ తో కుదేలైపోయిన కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఆపరేషన్ స్టార్ట్ చేసిందా? కొందరు టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? అందుకు రాహుల్ సభ వేదిక కానుందా? అవుననే అంటున్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, వారిని వచ్చే నెలలో జరిగే రాహుల్ సభలో చేర్చుకునేందుకు అన్నీసిద్ధం చేస్తున్నామని ఉత్తమ్ ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి చేరికతో జోరుమీదున్న కాంగ్రెస్ పార్టీ మరికొందరిని చేర్చుకుని అధికార పార్టీకి ఝలక్ ఇవ్వాలన్న ప్లాన్ లో ఉంది.
కొందరు సీనియర్లకు అప్పగింత...
అందుకే కాంగ్రెస్ కొందరు సీనియర్ నేతలు ఇదే పనిమీద ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలను కొంతవరకూ అడ్డుకోగలిగింది. ఇక టీఆర్ఎస్ నుంచి వచ్చే వారిని పార్టీలో చేర్చుకుని మరింత జోష్ పెంచాలన్నది వ్యూహంగా ఉంది. టీఆర్ఎస్ లక్ష్యంగా పావులు కదుపుతుంది. టీఆర్ఎస్ బలంగా ఉన్న వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి టీఆర్ఎస్ నేతలు పెద్దయెత్తున కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం జరుగుతోంది.
సిట్టింగ్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని...
వీరిలో కొందరు టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమకు టిక్కెట్ దక్కవని భావించిన వారితో పాటు పార్టీలో ఎదుగుదల లేదని అనుకున్న వారు కూడా హస్తం పార్టీలోకి రావడానికి రెడీగా ఉన్నారని గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. ‘తమకు ఆశ్చర్యం కల్గించే విషయం ఏంటంటే... కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి కూడా టీఆర్ఎస్ నేతలు పార్టీలో చేరడానికి ఆసక్తి చూపతున్నారు’ అని ఒక సీనియర్ కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు.
గిరిజన జాతరలో ...రాహుల్ సమక్షంలో...
ముఖ్యంగా టీఆర్ఎస్ సిట్టింగ్ లను పార్టీలో చేర్చుకుంటే అధికార పార్టీకి డిఫెన్స్ లోకి నెట్టవచ్చన్నది ఆ పార్టీనేతల ఆలోచన. వచ్చే నెలలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. సమ్మక్క, సారలమ్మ జాతర కు రావాలని ఇప్పటికే రాహుల్ ను ఆహ్వానించారు. ఆ జాతర గురించి చరిత్రను కూడా పీసీసీ రాహుల్ కార్యాలయానికి పంపింది. ఈ సందర్భంగా గిరిజన సదస్సును ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ సదస్సులోనే కొందరు సిట్టింగ్ లను పార్టీలో రాహుల్ సమక్షంలో చేర్చాలన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్లాన్ గా ఉంది. మరి కాంగ్రెస్ కౌంటర్ ఆపరేషన్ కు ఎవరు చిక్కుతారో చూడాలి.