కాంగ్రెస్ కు మంచి రోజులొస్తున్నట్లేనా?

Update: 2017-10-10 06:30 GMT

2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. ఇందుకు సవాలక్ష కారణాలున్నాయి. నేతల మితిమీరిన విశ్వాసం, ఐక్యత లేకపోవడం, ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పక పోవడం, మరోవైపు ఉద్యమనేత కేసీఆర్ కీలకంగా మారడంతో గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలయింది. ఈసారి అలా జరగకూడదని పార్టీ హైకమాండ్ ముందు జాగ్రత్తచర్యలు చాలానే తీసుకుంటుంది. ఇటీవల సంగారెడ్డి లో జరిగిన రాహుల్ గాంధీ సభ పూర్తిగా విజయవంతమైందనే చెప్పాలి. ఈ సభతో కాంగ్రెస్ నేతలకు బూస్ట్ తాగినట్లయింది. మంచి శక్తి వచ్చింది. అయితే రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణకు రానున్నారు. అదీ అధ్యక్ష హోదాలో తొలిసారి చేపట్టే రాష్ట్ర పర్యటన తెలంగాణే కావడం విశేషం. రాహుల్ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం ఇక నామమాత్రమే. ఈ నెల 25వ తేదీ తర్వాత రాహుల్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించ బోతున్నారు. రాహుల్ పట్టాభిషేకం తర్వాత తొలిపర్యటన తెలంగాణయే కావడం గమనార్హం. అంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తెలంగాణ ఎంత ప్రయారిటీ ఇస్తుందో రాహుల్ అధ్యక్ష హోదాలో తొలిసారి రావడాన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు.

మానుకోట వేదికగా......

ఈసారి రాహుల్ సభను మహబూబాబాద్ లో ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్ణయించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా తొలిసారి వస్తున్న ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. లక్షల సంఖ్యలో జససమీకరణ చేయనున్నారు. హైదరాబాద్ లో రాహుల్ కాలు మోపిన దగ్గర నుంచి సభా వేదిక వరకూ గ్రాండ్ వెలకమ్ చెప్పేందుకు ఏర్పాట్లు కాంగ్రెస్ నేతలు చేసుకుంటున్నారు. ఈ సభతో అధికార టీఆర్ఎస్ కు ఝలక్ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దయెత్తున కసరత్తులు చేస్తోంది. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి జనాన్ని సమీకరించాలని భావిస్తున్నారు. ప్రతి జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఉండేందుకు అందుకు బాధ్యులను కూడా నియమించనున్నారు. రాహుల్ టూర్ తో తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఊపు వస్తుందని పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ సభ ఏర్పాటు చేయడానికి ఆ ప్రాంతంలో టీఆర్ఎస్ ప్రాభవానికి గండికొట్టడానికే. మొత్తం మీద రాహుల్ పర్యటన మీద తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి చూద్దాం...ఏం జరుగుతుందో.

Similar News