అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్ ను విభజించి ప్రజల చేతుల్లో అత్యంత హీన స్థాయిలో దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బుద్ధి వచ్చేసింది. ఆ పార్టీ నిర్వహిస్తున్న ఎఐసిసి ప్లినరీ లో ఏపీకి ప్రత్యేక హోదా యుపిఎ 3 అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చి తీరుతామని తేల్చి చెప్పింది. ఈ మేరకు తీర్మానం కూడా చేసేసింది. గత ఎన్నికల్లో అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్ స్థానాల్లో ఒక్కసీటు కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోలేదు సరికదా డిపాజిట్లు సైతం దక్కించుకోలేదు. ప్రజలు ఆ పార్టీ తీసుకున్న నిర్ణయంపై అంతటి ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో నిప్పుల వర్షంలా కురిపించారు. తమ పార్టీ తీసుకున్న చారిత్రక తప్పిదంతో ఇప్పట్లో ఎపి లో మొదటి స్థానం దేవుడెరుగు రెండు మూడు స్థానాలను కూడా ఆశించలేని స్థితికి కాంగ్రెస్ చేరుకుంది. ఈ దుస్థితి అంచనా వేసిన అధిష్టానం పోయిన చోటే వెతుక్కునే పనిలో పడింది. ఎపి ప్రజల ఆగ్రహం చల్లారంటే ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను అమలు చేసి తీరుతామన్న గట్టి హామీ తీర్మానం గా చేసింది.
కాంగ్రెస్ శ్రేణుల్లో మిన్నంటిన ఉత్సహం ...
ఎపి కోసం ఎఐసిసి లో చర్చ జరగడం, అందులో ప్రత్యేక హోదాను యుపిఎ 3 వస్తే ఇస్తామని, హామీలన్నీ నెరవేరుస్తామంటూ పార్టీ ప్రకటించడం పట్ల కాంగ్రెస్ ఎపి శ్రేణులు సంబరాల్లో మునిగి తేలాయి. సదస్సు వద్దే స్వీట్లు పంచుకుని హోదా వచ్చేసినంత హడావిడి చేశారు కాంగీయులు. ఎపి విభజన తో ప్రజల్లో తలెత్తుకుని తిరగలేని పరిస్థితి నుంచి చెప్పింది, ఇచ్చింది తామే అన్న స్లోగన్ తో పార్టీ పరిస్థితి గుడ్డిలో మెల్ల గా మారుతుందని క్యాడర్ లో జోష్ పెరిగింది. ఇక ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అయితే కాంగ్రెస్ ఎఐసిసి లో చేసిన తీర్మానాలు నూటికి 200ల శాతం అమలు చేసి తీరిన చరిత్ర ఉందని ప్రకటించారు కూడా. ఎపి ఎంపీలు పార్లమెంట్లో చేస్తున్న పోరాటానికి వారు పెట్టే అవిశ్వాసానికి సైతం కాంగ్రెస్ మద్దతు ను సదస్సులో ప్రకటించింది. ఇది ఇప్పుడు పాతాళానికి పోయిన హస్తం పార్టీని ఈమేరకు పైకి తెస్తుందో వేచి చూడాలి.