తెలంగాణలో ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. అందుకే ఇప్పటి వరకూ కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన నేతలను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అనేకమంది నేతలు అధికార పార్టీ గూటికి వెళ్లిపోయారు. కేవలం పవర్ కోసమే వారు పార్టీలోకి వెళ్లినా.. కేసీఆర్ వ్యవహారశైలిపై వారు సంతృప్తికరంగా లేరని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందుకే జిల్లాల వారీగా పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలను తిరిగి రప్పించేందుకు ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా కొందరు నేతలు ఇప్పటికే టచ్ లోకి వచ్చారని చెబుతున్నారు. రేవంత్ వ్యవహారంతో వాస్తవానికి కాంగ్రెస్ కు కొంత బూమ్ పెరిగిందనే చెప్పాలి. రేవంత్ రెడ్డి పార్టీలో చేరుతున్నారన్న వార్త ఆ పార్టీ నేతలు మొదట అభ్యంతరాలు వ్యక్తం చేసినా హైకమాండ్ ఆదేశాలతో మళ్లీ మౌనంగానే ఉన్నారు. పొంగులేటి వంటి నేతలు మాత్రం రేవంత్ రాకను ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నారు.
నైట్ సమావేశాలతో.....
అయితే రేవంత్ నేరుగా రాహుల్ ను కలిసి రావడంతో ఇక్కడి నేతలు ఏమీ చేయలేమన్న వాస్తవంలోకి వచ్చారు. ఇక రేవంత్ తో పాటు రాహుల్ తెలంగాణ పర్యటన సందర్భంగా మరికొందరు నేతలను కూడా పార్టీలోకి తీసుకురావాలన్న వ్యూహరచన చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక టీమ్ పనిచేస్తుందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు కాంగ్రెస్ కు పట్టుగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం నేతలు, ముఖ్యమైన వ్యక్తులతో నైట్ సమావేశాలను కాంగ్రెస్ నియోజకవర్గాలుగా ఏర్పాటు చేస్తోంది. నియోజకవర్గాల్లో రాత్రి వేళ రెడ్డి సామాజిక వర్గాల నేతలు, యువకులతో సమావేశమై వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ కు ఎంత ప్రతిష్టాత్మకమైనవో వివరించే పనిలో పడింది. ఈ బాధ్యతను కూడా అదే సామాజికవర్గానికి చెందిన జగ్గారెడ్డి లాంటి ముఖ్యనేతలకు అప్పగించినట్లు తెలుస్తోంది. మొత్తం కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు అన్నిరకాలుగా ప్రయత్నాలు ప్రారంభించింది. మరి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను ఈసారైనా జనం నమ్ముతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.