రాజ్యసభ ఎన్నికలు నేడు జరగనున్నాయి. దీంతో ఉత్కంఠ బయలుదేరింది. రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీలో సంఖ్యాపరంగా చూస్తే ఖచ్చితంగా ఆ మూడు స్థానాలూ టీఆర్ఎస్ కే వస్తాయి. కాని కాంగ్రెస్ మాత్రం పార్టీ అభ్యర్థిని నిలబెట్టింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలరాం నాయక్ బరిలో ఉన్నారు. దీంతో తెలంగాణలో రాజ్యసభ ఎన్నిక అనివార్యమయింది. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పో్టీకి దింపింది గెలవాలని కాదు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి వారిని ఇరుకున పెట్టడానికే.
ఏడుగురు ఎమ్మెల్యేలను టార్గెట్ చేసేందుకేనా?
గత ఎన్నికలలో కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి అధికార టీఆర్ఎస్ లో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ చాలా కాలం కిందటే ఫిర్యాదు చేసింది. న్యాయపోరాటానికి కూడా దిగింది. అయినా చర్యలు లేకపోవడంతో రాజ్యసభ ఎన్నికలతో జంప్ జిలానీలను ఇరుకున పెట్టాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కన్పిస్తోంది. కాంగ్రెస్ కు గత ఎన్నికల్లో 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో ఏడుగురు పార్టీ ఫిరాయించగా, ఇద్దరి శాసనసభ్యుల సభ్యత్వాలపై అనర్హత వేటు పడింది. అంటే కాంగ్రెస్ అభ్యర్థికి 17 ఓట్లు రాజ్యసభ ఎన్నికల్లో పడాల్సి ఉంటుంది.
బలమైన సాక్ష్యం లభిస్తుందని.....
ఈ మేరకు పార్టీ ఫిరాయించిన చిట్టం రామ్మోహన్ రెడ్డి, రెడ్యానాయక్, కాలే యాదయ్య, కనకయ్య, పువ్వాడ అజయ్, భాస్కరరావు, విఠల్ రెడ్డిలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విప్ కాపీలను అందజేసింది. వారు పార్టీకి ఓటు వేయక పోతే తమకు సాక్ష్యం దొరికే అవకాశముందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ సాక్ష్యంతో న్యాయ పోరాటానికి దిగివచ్చన్నది కాంగ్రెస్ నేతల ఆలోచన. అయితే ఇది ఎంతవరకూ సాధ్యమో తెలియకున్నా కాంగ్రెస్ నేతలు మాత్రం రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగింది ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేందుకేనన్నది సుస్పష్టం. ఇప్పటికే తెలంగాణ పార్టీ ఇన్ ఛార్జి కుంతియా, సీనియర్ నేతలు జానారెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు ఇతర సీనియర్ నేతలు సమావేశమై రాజ్యసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.