ఎన్నికల నోటిఫికేషన్ కు ఆరు వారాలు ఆగాలంటూ హైకోర్టు ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఉప ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ అంత సిద్ధంగా ఉందా? అన్న ప్రశ్న ఆ పార్టీలోనే తలెత్తుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఉప ఎన్నికలకు వెళ్లాలని ఉత్సాహపడుతున్నారు. ఇటీవల శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ పై హెడ్ ఫోన్ విసిరేయడంతో నల్లగొండ, ఆలంపూర్ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ్యత్వాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.
దూకుడు పెంచిన టీఆర్ఎస్....
అయితే నల్లగొండ, ఆలంపూర్ ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని, అక్కడ విజయం సాధించి తీరాలని ఇప్పటికే గులాబీ బాస్ నల్లగొండ, మహబూబ్ నగర్ మంత్రులు, పార్టీ నేతలతో సమావేశాలు జరిపారు. అభ్యర్థులను ఎవరిని నిలిపినా అందరూ కలసి కట్టుగా కృషి చేసి విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఆ రెండు జిల్లాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ హడావిడి మొదలయింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని క్యాడర్ కు కేసీఆర్ పిలుపు నివ్వడంతో ఇప్పటి నుంచే ఆ రెండు నియోజకవర్గాల్లో నేతల పర్యటనలు ప్రారంభమయ్యాయి.
కాంగ్రెస్ లో గందరగోళం....
కాని కాంగ్రెస్ మాత్రం ఈ విషయంలో గందరగోళంలో ఉన్నట్లు కన్పిస్తోంది. ఎందుకంటే నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో పార్టీలో ఉన్న గ్రూపు విభేదాలు తమ కొంపముంచుతాయన్న బెంగతో ఉన్నారు ఆ పార్టీ నేతలు. ఎందుకంటే ఈ రెండు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు విజయావకాశమే దక్కలేదు. దీంతో ఆ పార్టీలో రెండు స్థానాల ఉప ఎన్నికలపై జోరుగా చర్చ జరుగుతోంది. బస్సు యాత్రతో మంచి ఊపుమీద ఉన్నామనుకుంటున్న తరుణంలో ఉప ఎన్నికలు అనవసరంగా వచ్చి పడతాయోమోనన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.
రెండు జిల్లాల్లో గ్రూపుల గోల.....
దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందని ఇప్పటి వరకూ ఆ పార్టీ నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉప ఎన్నికలు వస్తాయని భావిస్తున్న నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలోనే గ్రూపుల గోల ఎక్కువగా ఉంది. శాసనసభ్యత్వం రద్దయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అస్సలు పడదు. అక్కడ అనేక గ్రూపులున్నాయి. ఒకరిని ఒకరు ఓడించుకునేందుకు ప్రయత్నాలు చేస్తారన్న ఆందోళన ఆ పార్టీ నేతల నుంచే విన్పిస్తోంది. ఇక ఆలంపూర్ నియోజకవర్గానికి వస్తే గత ఎన్నికల్లో ఆలంపూర్ లో సంపత్ కుమార్ గెలుపుకు మాజీ మంత్రి డీకే అరుణ కృషి చేశారు. అయితే ఇటీవల రేవంత్ రెడ్డి చేరిక సందర్భంగా వీరి మధ్య పొసగడం లేదు. దీంతో ఉప ఎన్నికలు వస్తే ఎలా అని కాంగ్రెస్ లోని కొందరు నేతలు మదనపడిపోతున్నారు. అయితే సెంటిమెంట్ తమను గెలిపిస్తుందన్న నమ్మకంతో కొందరు ఉన్నారు. మరి కాంగ్రెస్ అధికార పార్టీకి ధీటుగా ఎలాంటి ఎత్తులు వేస్తుందో చూడాలి.