కర్ణాటకం కాంగ్రెస్ దే

Update: 2018-03-27 18:29 GMT

భార‌త‌దేశ వ్యాప్తంగా నార్త్ టు సౌత్ వ‌ర‌కు అన్ని రాష్ట్రాల ప్ర‌జ‌లు తీవ్ర ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తోన్న క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల కమిషన్ షెడ్యుల్ విడుదల చేసింది. ఏప్రిల్ 17న ఎన్నికల నోటిఫికేషన్, 24 నుంచి నామినేషన్ల ప్రక్రియ, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 27. మే 12న పోలింగ్, 15న ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల కమిషన్ తెలిపింది.

సీఫోర్ సంస్థ సర్వేలో....

షెడ్యుల్ కు ముందు సీ ఫోర్ సంస్థ నిర్వహించిన ప్రీపోల్ సర్వే కన్నడనాట మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగురుతుందని చెబుతోంది. సిద్దరామయ్యకే మళ్లీ పట్టం కట్టేందుకు కన్నడిగులు సిద్ధంగా ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది. దీంతో ఎలాగైనా కర్ణాటకలో అధికారంలోకి రావాలనుకొంటున్న బీజేపీ కి సర్వే ఫలితాలు మింగుడు పడడం లేదు. అయితే గతంలో కంటే సీట్ల సంఖ్య పెరుగుతుందని తేలడం కాస్త ఉపశమనం కలిగిస్తోంది.

ప్రీపోల్ సర్వేలో....

కర్ణాటకలో మొత్తం 224 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ఇందులో 154 స్థానాల్లో సీఫోర్ సంస్థ ఈ నెల ఒకటో తేదీ నుంచి 25 వరకు ప్రీపోల్ సర్వే నిర్వహించింది. బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప, జేడీఎస్ నేత కుమారస్వామికి చుక్కెదురు తప్పదని సర్వేలో తేలడంతో రాష్ట్రంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

సర్వే వివరాలు ఇలా ఉన్నాయి....

- కర్ణాటకలోని 154 నియోజకవర్గాల్లో మార్చి 1 నుంచి 25 వరకు ప్రీపోల్‌ సర్వే జరిగింది.

- 2,368 పోలింగ్‌ బూత్‌లలో 22,357 మంది ఓటర్ల నుంచి అభిప్రాయాలు సేకరించింది.

- కాంగ్రెస్‌కు ఓట్ల శాతం 46కు పెరగనుంది.

- బీజేపీ 31%, జేడీఎస్‌ 16% ఓట్లు రానున్నాయి.

- కాంగ్రెస్‌కు 112 నుంచి 126 సీట్లు, బీజేపీకి 70 సీట్లు, జేడీఎస్ కు 27 సీట్లు వస్తాయని వెల్లడి.

- బెంగళూరు పరిధిలోని 28 నియోజకవర్గాల్లో 19 స్థానాలు కాంగ్రెస్‌కే దక్కనున్నాయి.

- పాత మైసూరు రీజియన్‌లో కాంగ్రెస్‌కు 33, బీజేపీకి 7, జేడీఎస్ కు 24 స్థానాలు దక్కనున్నాయి.

- ముంబై కర్ణాటక రీజియన్‌లోని 50 స్థానాలకుగాను కాంగ్రెస్‌కు 28, బీజేపీకి 22 దక్కనున్నాయి.

- కోస్తాలో కాంగ్రెస్‌కు10, బీజేపీకి 9 దక్కనున్నాయి.

- హైదరాబాద్‌-కర్ణాటకలోని 40 స్థానాల్లో 27 కాంగ్రెస్‌కు, 10 బీజేపీ ఖాతాలో చేరనున్నాయి.

- కాంగ్రెస్‌ సీఎంగా మరోసారి పగ్గాలు చేపడతారనే ప్రచారంలో ఉన్న సిద్దరామయ్యకు 45% మంది మద్దతు పలికారు.

- యడ్యూరప్పకు 26% మంది మాత్రమే ఓటేశారు

Similar News