కరణంకు కాలం కలిసి రాలేదా?

Update: 2017-10-13 01:30 GMT

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత టైం బాగోలేదట్లుంది. ఆయన అనుకున్నదానికి వ్యతిరేకంగా అన్నీ జరుగుతున్నాయి. అంతా సవ్యంగా జరిగితే ఆయన కేబినెట్ లో ఉండాల్సిన లీడర్. కాని కాలం కలిసి రాక ఆయనను దురదృష్టం వెంటాడుతూనే ఉంది. దీంతో ఆయన తనతో పాటు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు పైనా ఆందోళన చెందుతున్నారు. ఆయనే ప్రకాశం జిల్లా టీడీపీ నేత కరణం బలరాం. కరణం బలరాం అంటే ఒకప్పుడు జిల్లానే శాసించారు. పార్టీలో ఆయన చెప్పిందే వేదం. జిల్లాలో చీమచిటుక్కు మనాలన్నా కరణం కనుసైగ చేయాల్సిందే. అలాంటి కరణం బలరాం ఇప్పుడు ఒంటరిగా మారిపోయారు. నిర్వేదానికి లోనవుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తనకు, తన కుమారుడికి సీటు దక్కదన్న ఆందోళన ఆయనను నిద్రపోనివ్వడం లేదు. దీంతో కరణం డైలమాలో ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. కరణం బలరాం తొలి నుంచి తెలుగుదేశం పార్టీనే నమ్ముకున్నారు. పదేళ్లపాటు అధికారంలోకి లేకపోయినా పార్టీ కోసం ఆయన పని చేశారు. అయితే 2014 అధికారంలోకి తెలుగుదేశం రావడంతో తను ఓటమి పాలయినా తన హవాకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని భావించారు. కాని సీన్ రివర్స్ అయింది. కరణం బలరాం అద్దంకి నియోజకవర్గంపై పట్టుంది. గతంలో అద్దంకి, మార్టూరు నియోజకవర్గాల నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. అలాంటి కరణం బలరాం ఇప్పుడు పార్టీకి పనికిరాకుండా పోయారన్నది ఆయన అనుచరుల ఆవేదన.

అనుచరుల నుంచి తీవ్ర వత్తిడి......

అద్దంకి నియోజకవర్గానికి నిన్న మొన్నటి వరకూ కరణం బలరాం తనయుడు కరణం వెంకటేశ్ ఇన్ ఛార్జిగా వ్యవహరించేవారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వెంకటేశ్ పార్టీ అధికారంలో ఉండటంతో ఎక్కువ సమయం అద్దంకి నియోజకవర్గంలోనే గడిపేవారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి రవికుమార్ టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో సమస్యలు తలెత్తాయి. రెండు వర్గాలూ ఢీ అంటే ఢీ అనుకున్నాయి. హత్యలు కూడా జరిగాయి. అయితే అధిష్టానం మాత్రం ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కే నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. దీంతో కరణం కుటుంబం అద్దంకిని వీడాల్సి వచ్చింది. కరణం బలరాంకు ఎమ్మెల్సీగా ఇచ్చినప్పటికీ ఆయన తనకు పట్టున్న నియోజకవర్గమైన అద్దంకి పై పెత్తనం లేకుండా పోయింది. దీంతో కరణం తీవ్ర మనస్థాపానికి గురవుతున్నట్లు తెలిసింది. ఇన్ని అవమానాలు భరిస్తూ పార్టీలో ఎందుకుండాలని కరణం అనుచరులు ప్రశ్నిస్తున్నా ఆయన సముదాయించుకుని ఇప్పటి వరకూ వస్తున్నారు. కాని తాజాగా కరణం బలరాంకు మరో అవమానం కూడా జరిగింది. ఇప్పటి వరకూ టీడీపీ పొలిట్ బ్యూరోలో సభ్యులుగా ఉన్న కరణం బలరాంను పార్టీ అధిష్టానం తొలగించింది. దీంతో కరణం తనను పూర్తిగా పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అర్ధమైంది. నమ్ముకున్న పార్టీలోనే దెబ్బ దెబ్బ మీద తగులుతుండటంతో కరణం జీర్ణించుకోలేక పోతున్నారు. అధినేతతోనే మాట్లాడి త్వరలో సమస్యను తేల్చేస్తానని కరణం తన అనుచరులను ఊరడిస్తున్నారు. మొత్తం మీద కాలం కలసిరాని కరణం ఏం చేయనున్నారో.

Similar News