కమల్ హాసన్ దూకుడు పెంచుతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే బీజేపీపై యుద్ధం చేస్తున్న ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్ ను కలుసుకున్న సంగతి తెలిసందే. తాజాగా ఈరోజు కమల్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీని కోల్ కత్తా లో కలవడం చర్చనీయాంశమైంది. కమల్ రాజకీయాల్లోకి రావడానికి ముందే కొందరు మేధావులు, రాజకీయ నేతలతో సమావేశమవుతున్నారు. ఈ మధ్య తన పుట్టిన రోజు సందర్భంగా తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి వారి అనుమతిని తీసుకున్న తర్వాతనే పార్టీని ప్రకటిస్తానని చెప్పారు. ఈ మేరకు తమిళనాడు అంతటా పర్యటించడానికి కమల్ రెడీ అవుతున్నారు.
ముగ్గురు ముఖ్యమంత్రులూ....
కమల్ హాసన్ తొలిరోజుల్లో నోట్ల రద్దును సమర్ధించారు. జయలలిత మరణం తర్వాత కమల్ మార్పు కనిపిస్తూ వస్తోంది. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని ప్రచారం జరగడం, స్థానికుడు కాదని కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కమల్ దానిని అందిపుచ్చుకున్నారు. అందుకోసమే రజనీకంటే ముందు రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు కమల్ వార్ బీజేపీతోననే అర్థమవుతోంది. ప్రధానంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పార్టీ పరంగా, సిద్ధాంత పరంగా కమలం పార్టీకి వ్యతిరేకమని తెలిసిందే. అయినా కేరళ వెళ్లి మరీ పినరయి విజయన్ ను కలిసివచ్చారు కమల్. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రజల మద్దతులో ముఖ్యమంత్రి అయినా కేంద్ర ప్రభుత్వం ఎంత కుస్తీలు పడుతున్నారో్ కూడా తెలుసు. కేజ్రీ కేవలం మోడీ మీదే మాటల దాడికి దిగుతారు. దీంతో ఆయనతో కూడా కమల్ భేటీ అయ్యారు. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, ఫైర్ బ్రాండ్ మమత బెనర్జీ మోడీ అంటేనే మండిపడుతున్నారు. ప్రతి విషయంలోనూ బీజేపీ పై దాడికి దిగుతున్నారు. ఆమెను కూడా కమల్ కలవడంతో తన రాజకీయ ప్రయాణం కమలం పార్టీతో వైరంతోనే సాగాలని కమల్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది.