కమల్ లో ఆ ధీమా ఎందుకో...?

Update: 2018-02-19 18:29 GMT

నిన్న మొన్నటివరకు తన మిత్రుడు రజనీకాంత్ పై దుమ్మెత్తిపోసిన కమల్ హాసన్ ఆయన్ను తన పార్టీ ప్రారంభోత్సవానికి పిలిచి హాట్ టాపిక్ గా ఈ ఎపిసోడ్ ను మార్చేశారు. రజని పార్టీ స్థాపించకుండానే ఆయనపై విమర్శలదాడి తొలిగా మొదలు పెట్టింది కమల్ హాసనే. ఆ తరువాత రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించింది తన పార్టీతో కలిసి పనిచేయాలంటూ కోరింది, ఆ తరువాత తమ ఇద్దరిది విభిన్న ఆలోచనలు అంటూ వ్యాఖ్యలు చేసింది కమల్ హాసనే . అలాంటి కమల్ స్వయంగా రజని ఇంటికి వెళ్ళి తన పార్టీ ఓపెనింగ్ కి రావాలని సినిమా ప్రారంభానికి పిలిచినంత సులువుగా ఆహ్వానించడం చర్చనీయాంశం అయ్యింది. తమిళ సూపర్ స్టార్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన తరువాత తమిళనాడులో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.

డబ్బుకోసం కాదు ...

కమల్ హాసన్ పై రజనీకాంత్ సాఫ్ట్ గా స్పందించారు. తన మిత్రుడు డబ్బుకోసం రాజకీయాల్లోకి రావడం లేదని వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవ చేయడానికే కమల్ పార్టీ పెట్టారని కితాబునిచ్చారు. కమల్ తో తాను రాజకీయాల్లో కలిసి ప్రయాణించే విషయంలో మాత్రం తలైవా స్పష్టత ఇవ్వలేదు. తాజాగా ఈరోజు డీఎండీకే చీఫ్ విజయ్ కాంత్ ను కలిశారుకమల్. విజయకాంత్ కార్యాలయానికి వెళ్లిన కమల్ ఆయనతో ప్రత్యేకంగాభేటీ అయ్యారు. సినిమాల్లో తాను సీనియర్ నే అయినా రాజకీయాల్లో మాత్రం విజయ్ కాంత్ సీనియర్ అని కమల్ చెప్పారు. త్వరలో పార్టీని పెట్టి కమల్ హసన్ తమిళనాడు అంతటా పర్యటించబోతున్నారు.

గెలుపు తనదేనన్న ధీమా...

విలక్షణ నటుడు కమల్ హాసన్ రజనీకాంత్ తో గంటకు పైగా సమావేశం అయ్యారు. ఆ తరువాత తాము ఇద్దరం కలిసి రాజకీయాల్లో ప్రయాణించేది లేనిది కాలమే నిర్ణయిస్తుందని ప్రకటించారు. మా ఇద్దరి ఆలోచనలు వేరు. కానీ ఇద్దరం ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వస్తున్నాం అన్నారు కమల్. ఈనెల 21 న మధురై లో పార్టీ ని ప్రారంభించనున్న కమల్ రామనాథపురం లో నిర్వహించే బహిరంగ సభలో పార్టీ పేరు విధివిధానాలు వెల్లడించనున్నారు. ఆయన కొత్త పార్టీ ఎలా వుండబోతుందన్న ఆసక్తి ఇప్పడు అన్ని వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మాస్ క్లాస్ ఫాలోయింగ్ వున్న ఇరువురు హీరోలు తమిళనాడులో ఏర్పడిన రాజకీయ అనిశ్చితికి తెరదించుతారా లేదా అన్నది వేచి చూడాలి. ఇలా కమల్ తన పార్టీ ప్రారంభోత్సవానికి రాజకీయాలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఎల్లుండే పార్టీ ప్రకటన ఉంటుంది. తాను పెట్టబోయే పార్టీ ద్రవిడ భావాజాలన్ని అనుసరించే విధంగా ఉంటుందని కమల్ తెలిపారు. ఖచ్చితంగా తన పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. బుధవారం పార్టీ ప్రారంభిస్తుండటంతో ఆయన రాజకీయనాయకులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన అనేకమందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో గెలుపుపై కమల్ అంత ధీమాగా ఎందుకు ఉన్నారో...?

Similar News