కమల్ హాసన్ ఎట్టకేలకు తన మనసులో మాటను బయటపెట్టేశారు. పార్టీని స్థాపించి తీరతానని చెప్పేశారు. గత ఆరు నెలలుగా కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన ఎక్కువగా ట్వీట్ల ద్వారానే అధికార పార్టీలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళుతుండటంతో కమల్ రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే ఆయన పార్టీ పెడతానని గాని, పెట్టనని గాని ఇంతవరకూ చెప్పలేదు. అయితే ఈరోజు కమల్ క్లారిటీ ఇచ్చేశారు. అభిమానులతో సమావేశమైన కమల్ హాసన్ తాను త్వరలోనే పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు.
త్వరలోనే పార్టీ ప్రకటన.....
అయితే ఎప్పుడు పార్టీ ప్రకటించేది త్వరలోనే తెలియజేస్తానన్నారు. తన అభిమానులు ఎవ్వరూ పుట్టిన రోజు వేడుకలు జరపవద్దని అభిమానులు కోరారు. వరద బాధితులను ఆదుకునేందుకు అభిమానులు కృషి చేయాలని కోరారు. అంతేకాదు తన పార్టీ విధివిధానాలను కూడా స్థూలంగా అభిమానులకు వివరించిన కమల్, అధికారం లోకి రావడానికే తాను పార్టీ పెట్టడం లేదని, ప్రజాసేవ కోసమే పెడుతున్నానని తెలిపారు. త్వరలోనే జెండా, ఎజెండాను ఖరారు చేసి ప్రజల ముందుకు వస్తానని కమల్ తన అభిమాన సంఘాల నేతలతో చెప్పారు. కాగా కమల్ ఇప్పటికే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయి రాజకీయ చర్చలు జరిపారు. సో... త్వరలోనే తమిళనాడులో కొత్త పార్టీ రాబోతుందన్నమాట.