కమల్... ట్వీట్లు... ఫీట్లు...పనిచేస్తాయా?

Update: 2017-10-29 18:29 GMT

నిన్నటి దాకా ట్వీట్లకే పరిమితమైన కమల్ హాసన్ నేడు క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యల కోసం పర్యటనలు ప్రారంభించినట్లుంది. కమల్ రాజకీయ పార్టీ పెట్టకముందే ప్రజాసమస్యలపై స్పందిస్తూ వస్తున్నారు. అనేక సమస్యలపై ఆయన ట్వీట్ల ద్వారా తన అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నారు. త్వరలోనే రాజకీయ పార్టీని పెడతానని ప్రకటించిన కమల్ అందుకు అనుగుణంగా కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. కేవలం అభిమానులతోనూ, మేధావులతోనూ నాలుగు గోడల మధ్యనే చర్చించిన కమల్ ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగడంతో కమల్ రాజకీయ ప్రవేశం అతి త్వరలోనే ఉంటుందని తేలిపోయింది.

క్షేత్రస్థాయి పర్యటనకు కమల్.....

ఎన్నూర్ ప్రాంతంలో పరిస్థితి పై కమల్ అనేక సార్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర చెన్నైకి తీవ్ర ముప్పు పొంచి ఉందని కమల్ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ నెలకొల్పిన పవర్ ప్లాంట్ వల్ల కాలుష్యం పెరిగిపోయిందని ఆవేదన చెందారు. దీంతో తన అభిమానులు, అనుచరులతో కలిసి కమల్ ఎన్నూరులో పర్యటించారు. అక్కడ కాలుష్యం బారిన పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. నదులు కలుషితమై జాలర్ల జీవితం కూడా రోడ్డున పడిందని ఆవేదన చెందిన కమల్...ప్రజలంతా కలిసి వస్తే ఈ సమస్యపై పోరాటం చేయడానికి తాను సిద్ధమని ప్రకటించారు. మరిన్ని సమస్యలపై కూడా కమల్ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొత్తం మీద కమల్ రాజకీయాల్లోకి రావడం ఖాయమైనా... ప్రజాసమస్యలపై గ్రౌండ్ లెవెల్ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి స్వయంగా దిగడంతో ఆయన అభిమానులు సంబరపడి పోతున్నారు. అయితే కమల్ ట్వీట్లు... ఫీట్లు రాజకీయాల్లో పెద్దగా పనిచేయవని అన్నాడీఎంకే నేతలు అంటున్నారు.

Similar News