కమల్ హాసన్ పార్టీని రేపే ప్రకటించబోతున్నారు. మధురై మీనాక్షి సాక్షిగా ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారు. మధురైనే కమల్ ఎంచుకోవడంలో గత చరిత్ర దాగి ఉందంటున్నారు. మధరై మాజీ ముఖ్యమంత్రులు ఎంజి రామచంద్రన్, జయలలితకు కూడా కలసి వచ్చింది. 1986లో మధురైలోనే తన వారసురాలిగా జయలలితను ఎంజీఆర్ మధురైలోనే ప్రకటించారు. విజయ్ కాంత్ ది కూడా అదే బాట.విజయ్ కాంత్ కూడా మధురై నుంచే పార్టీని ప్రారంభించారు. అందరికీ కలిసి వచ్చిన ప్రాంతంలో... మధురై మీనాక్షి ఆశీస్సులతో రేపు సాయంత్రం పార్టీ ప్రకటన చేయబోతున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మధురైలోని ఒత్తికడై లో యాభై ఎకాలున్న మైదానంలో భారీ బహిరంగ సభకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. తమిళనాడులోని అన్ని ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో కమల్ అభిమానులు ఇప్పటికే మధురై నగరానికి చేరుకున్నారు.
రేపే పార్టీ ప్రకటన.....
ఈ కార్యక్రమంలోనే పార్టీ జెండాను, విధివిధానాలను ప్రకటించనున్నారు కమల్. కమల్ ఇప్పటికే తన విధానాన్ని స్పష్టం చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగానే ఆయన రాజీకీయాల్లోకి వచ్చారన్నది ఎన్నోసార్లు స్పష్టం చేశారు. మతతత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమని పదేపదే చెప్పే కమల్ హిందుత్వానికి మాత్రం తాను వ్యతిరేకిని కాదన్నారు. ముఖ్యంగా తమిళనాడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదుకోవడంలో విఫలమయిందని అనేకసార్లు వివిధ సందర్భాల్లో ఆరోపించిన సంగతి తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్ యేతర పక్షంగానే కమల్ పార్టీ ఉండబోతోందనిచెబుతున్నారు.
ముఖ్య అతిధిగా కేజ్రీవాల్.....
రేపు పార్టీ ఆవిర్భావ సభకు కమల్ ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, విజయకాంత్, రజనీకాంత్ లను ఆహ్వానించారు. అయితే వీరిలో అరవింద్ కేజ్రీవాల్, మమత బెనర్జీ ఈసమావేశానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. కమల్ రాజకీయాల్లోకి రావాలని, అవినీతిని అంతం చేయాలంటే పాలిటిక్స్ లోకి రావాలంటూకమల్ కు అనేకసార్లు కేజ్రీవాల్ పిలుపు నిచ్చారు. రాజకీయాల్లోకి వచ్చే ముందే కమల్, అరవింద్ కలుసుకుని చర్చలు కూడా జరిపారు. దీంతో కేజ్రీవాల్ కమల్ సభకు హాజరవుతారని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కమల్ రేపు చేయబోయే ప్రకటన తమిళ రాజకీయాల్లో మరో సంచలనానికి దారితీస్తుందన్నది విశ్లేషకుల అంచనా. పార్టీ సిద్ధాంతాలతో పాటు, తమిళ ప్రజలకు తాను ఏం చేయగలుతామో సవివరంగా చెప్పబోతున్నారు.