పార్టీ ప్రకటించి కమల్ హాసన్ ఊరుకోలేదు. ఆయన రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. గత నాలుగురోజులుగా కమల్ హాసన్ రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కమల్ పర్యటనకు మంచి స్పందన లభిస్తుంది. మక్కల్ నీది మయ్యమ్ పార్టీని పెట్టిన కమల్ హాసన్ వరుస పర్యటనలను ప్రారంభించారు. ఈ పర్యటనలతో ప్రజలతో మమేకం కాకుండా జిల్లాల్లో పార్టీని బలోపేతంచేయడంపైన కూడా దృష్టి పెట్టారు. పర్యటనకు ముందు, తర్వాత ఆ ప్రాంతంలో ముఖ్యమైన కార్యకర్తలతో కమల్ సమావేశమవుతున్నారు.
నాలుగు జిల్లాల్లో పర్యటన....
ఆ జిల్లాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. అక్కడ ఏ పార్టీకి ఎంత ఓటు బ్యాంకు ఉందన్న విషయాన్ని కూడా ఆరా తీస్తున్నారు. ఆ జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలపై చర్చిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటి వరకూ తీసుకున్న చర్యల గురించి కూడా కార్యకర్తల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. దీంతోపాటుగా రోడ్ షో లు నిర్వహిస్తున్నారు. తాను డబ్బులు సంపాదించడం కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి, మార్పు తెచ్చేందుకే పాలిటిక్స్ లోకి వచ్చానని ఆయన చెప్పుకుంటూ వెళుతున్నారు.
రజనీనైనా వదిలిపెట్టను....
తాజాగా కమల్ హాసన్ రజనీకాంత్ పై వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ పెట్టబోయే పార్టీలో విధాన పరమైన లోపాలుంటే విమర్శించడానికి తాను వెనుకాడబోనని చెప్పారు. తాను ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయబోనని, సిద్ధాంతాల్లో బేధాలుంటే రజనీతోనైనా విభేదిస్తానని చెప్పారు. తన పార్టీ లక్ష్యం ప్రజాసంక్షేమేమనన్న కమల్ హాసన్ రజనీకాంత్ ఎలాంటి విధానాలతో ముందుకు వస్తారో చూద్దామన్నారు. తాను, రజనీకాంత్ మంచి మిత్రులమని, అయితే రాజకీయంగా విభేదాలుంటే ఎవరినైనా విభేదిస్తానని కమల్ చెప్పడం విశేషం. మొత్తం మీద కమల్ హాసన్ పార్టీ పెట్టి ఇంట్లోకూర్చోకుండా సమస్యలపై అవగాహన పెంచుకునేందుకు ముందుకు రావడంతో ఆయన పర్యటనకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.