గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో విజయంసాధించిన కమలనాధులకు మంచు రాష్ట్రం హీట్ పుట్టిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బీజేపీకి తలనొప్పిగా మారింది. బీజేపీ ఎన్నికలకు ముందు ఇక్కడ ప్రేమ్ కుమార్ ధుమాల్ ను సీఎం అభ్యర్థిగా నిర్ణయించారు. అయితే ఆయన ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో మరో కొత్త నేతను ఎంపిక చేయాలని బీజేపీ భావించింది. కేంద్రమంత్రి జేపీ నడ్డాను హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పంపాలని కూడా ఆలోచన చేసింది.
సీఎం అభ్యర్థిగా....
హిమాచల్ ప్రదేశ్ శాసనసభపక్ష నేత ఎంపిక వ్యవహారాన్ని పరిశీలించేందుకు బీజేపీ ఇద్దరిని పరిశీలకులుగా నియమించింది. నరేంద్ర సింగ్ తోమర్, నిర్మలా సీతారామన్ లు పరిశీలకులుగా రాష్ట్రానికి చేరుకుని సమావేశం కూడా నిర్వహించారు. అయితే ఓటమి పాలయిన ప్రేమ్ కుమార్ ధుమాల్ నే సీఎం చేయాలని ఒక వర్గం గట్టిగా వత్తిడి తెచ్చింది. సమావేశంలోనే ధుమాల్ కు అనుకూలంగా నినాదాలతో హోరెత్తించింది. కాంగ్రెస్ పార్టీని తలపిస్తూ ఈ సమావేశం జరిగిందన్న వ్యాఖ్యలు కూడా విన్పించాయి.
గెలిచిన వారినే....
అయితే గెలిచిన వారినే ఒకరి ముఖ్యమంత్రిగా చేయాలని మరో వర్గం గట్టిగా వాదిస్తోంది. ఎటువంటి లాబీయింగ్ లకు తలొద్దని కూడా కొందరు ఎమ్మెల్యేలు పరిశీలకులకు నేరుగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో పరిశీలకులుగా వచ్చిన వారు సయితం ఈ నిర్ణయంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం 68 శాసనసభ స్థానాలుండగా, బీజేపీ 44 స్థానాల్లో గెలిచంది. పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నప్పటికీ సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో అష్టకష్టాలు పడుతోంది.