కమలం పార్టీలో కలవరం మొదలయింది. తెలంగాణలో బీజేపీ బలోపేతం అవ్వడం అటుంచి... ఉన్న నేతలను కాపాడుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇన్నాళ్లూ మోడీ హవా చూసి తమ పార్టీలోకి వలసలు ఎక్కువగా ఉంటాయని డంబాలు పలికిన కమలం పార్టీ నేతలు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో విస్తుపోతున్నారు. బీజేపీ అంటేనే సిద్ధాంతాల ప్రాతిపదికన ఏర్పడిని పార్టీ. ఆ పార్టీలో పనిచేయాలంటే కిందిస్థాయి నుంచి పనిచేస్తూ వచ్చి అన్ని రకాలుగా ఫిట్ అయిన తర్వాత పదవులు దక్కుతాయి. ఇందుకు ఉదాహరణ వెంకయ్యనాయుడనే చెప్పాలి. కాని మోడీ, షాల యుగంలో అంతా కలగూరగంపలా తయారైంది. వచ్చిన వారిని వచ్చినట్లు చేర్చుకోమన్న సంకేతాలతో తెలంగాణలో కూడా గతంలో అనేకమంది ఇతర పార్టీల నేతలకు కాషాయ కండువా కప్పేశారు.
పార్టీని వీడుతున్న....
నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో వలసల భయం ఉండేది. అమిత్ షా గతంలో వచ్చినప్పుడు కాంగ్రెస్ నేతలు అనేకమంది తమ పార్టీవైపు వస్తున్నారని బీజేపీ నేతలు గొప్పగా చెప్పుకున్నారు. వీరిలో కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు మరికొంతమంది ప్రముఖుల పేర్లు కూడా విన్పించాయి. అయితే అదేమీ జరగలేదు. ఒక్కనేత కూడా కమలం పార్టీవైపు తొంగి చూడలేదు. రా...రామ్మని ఆహ్వానాలు పంపుతున్నా... మంతనాలు జరుపుతున్నా బీజేపీలోకి వచ్చేందుకు తెలంగాణలో ఏ నేతా ఇష్టపడటం లేదు.
రాష్ట్ర నాయకుల వైఖరే కారణమా?
ఇందుకు కారణాలు అనేకం ఉన్నాయి. బీజేపీలోకి వెళితే అక్కడి రాష్ట్ర నాయకత్వం సరిగా పట్టించుకోదన్న సంకేతాలు బలంగా వెళ్లాయి. అంతేకాదు రాష్ట్ర స్థాయి నేతల్లో ఉన్న విభేదాలు సయితం చికాకు తెప్పిస్తాయి. అందుకే సీనియర్ నేత నాగం జనార్థన్ రెడ్డి వంటి వారే బీజేపీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఎంతకాదనుకున్నా నాగం ప్రజాదరణ ఉన్న నేత. ఆ రాష్ట్ర స్థాయి నేతను ఉపయోగించుకోవడంలో పార్టీ పూర్తిగా విఫలమయింది. కేసీఆర్ పై విమర్శలు చేయాలంటే నాగం జనార్ధన్ రెడ్డికి అనుమతివ్వరు. అలాగే ఒక అంశాన్ని తీసుకుని ఆందోళనకు దిగుదామన్నా పర్మిషన్ దొరకదు. దీంతో ఇక లాభం లేదనుకున్న నాగం ఆ నేతల చెవిలో కమలం పెట్టేసి ఉగాది తర్వాత వెళ్లిపోనున్నారు. నాగం జనార్థన్ రెడ్డి చేసిన ప్రకటనలో ఇక బీజేపీ వైపు ఎవరూ చూడని పరిస్థితి. ఎందుకంటే నాగం లాంటి నేతలకే గౌరవం దక్కకుంటే ఇక మామూలు నేతల పరిస్థితి చెప్పనక్కరలేదు.
బుజ్జగింపులు కూడా పనిచేయడం లేదే?
నాగం జనార్థన్ రెడ్డి పార్టీ వీడుతున్నారని తెలిసి ఆయనను బుజ్జగించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. ఆయన ఇంటికివెళ్లి మరీ మంతనాలు జరిపారు. పార్టీలో ఉంటే ఏదో ఒక పదవి లభిస్తుందని ఆయనకు ఆశలు కల్పించారు. అయినా నాగం ససేమిరా అన్నారు. తాజాగా బీజేపీకి కొమ్మూరిప్రతాప్ రెడ్డి కూడా బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన పార్టీలో చేరిన నాటి నుంచి పట్టించుకోవడం మానేశారు. రాష్ట్ర కమిటీలో కూడా ఆయనకు ప్రాధాన్యత లేదు. దీంతో ఆయనకు రాజీనామాకు సిద్ధమయ్యారు. ఇలా నేతలందరూ పార్టీని వీడుతుండటంతో కమలం పార్టీ కుదేలైపోతోంది. నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు కూడా ఎవరూ నడుంబిగించకపోవడం విశేషం. మొత్తం మీద కమలం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఆపసోపాలు పడక తప్పదనే చెప్పొచ్చు.