కమలంతో మరింత దూరంగా కారు ...?

Update: 2017-10-15 12:30 GMT

రాష్ట్ర విభజన తరువాత ఎన్డీయేలో చేరకపోయినా కొత్త రాష్ట్ర సమస్యల పరిష్కారానికి ఢిల్లీ లోని బిజెపి పాలకులకు స్నేహ హస్తం చాచారు కేసీఆర్. మోడీ నోట్లు రద్దు చేసినా జై అన్నారు , జీఎస్టీ పెట్టేముందు సూపర్ అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక తెలంగాణ పర్యటనకు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వచ్చినప్పుడు మాత్రమే షాపై ఒంటికాలిపై లేచినా ప్రధాని మోడీని పల్లెత్తు మాట అనలేదు గులాబీబాస్ . ఇలా ఫెవికాల్ బంధంలా బిజెపితో మంచి సంబంధాలు నెరపిన టిఆర్ ఎస్ వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కారు గేర్ మార్చి స్పీడ్ పెంచి బిజెపి పై కారాలు మిరియాలు సీరియస్ గా నూరేస్తుంది.

ప్రధానిని టార్గెట్ చేస్తున్న టిఆర్ ఎస్ ...

వాళ్ళను వీళ్ళను అంటే లాభం లేదని ఇక ప్రధాని టార్గెట్ గా రాజకీయాలు సాగిస్తూ తాము బిజెపితో సఖ్యతగా లేమన్న సంకేతాలు మైనారిటీ వర్గాలకు ఇచ్చేందుకు గులాబీ పార్టీ సిద్ధం అయ్యింది . ఇప్పటికే పలు సందర్భాల్లో ఆ పార్టీ శ్రేణులు బిజెపి పై, కాంగ్రెస్ పై విరుచుకుపడుతున్న స్థాయిలోనే విమర్శలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. తాజాగా తెలంగాణ హై కోర్టు ఏర్పాటుపై ఎంపీ వినోద్ ప్రధానికి లేఖ రాయడం వెనుక బిజెపితో తాము యుద్ధమే చేస్తామన్న సంకేతాన్ని టిఆర్ ఎస్ పంపింది. ఇలా చాలా కాలంగా ఢిల్లీ తో సాగుతున్న దోస్తీకి ఇక చెక్ చెప్పే సమయం ఆసన్నం అయిందని గ్రహించే గులాబీ దళపతి వ్యూహం మార్చారు.

బిజెపి అదే కోరుతుంది ...

తమ బలం మాట ఎలా వున్నా బిజెపి కూడా తెలంగాణాలో వ్యవస్థాగతంగా బలమైన పునాదులు వేసుకోవాలంటే ఒంటరిగా పోటీ చేయాలని కమలనాధులు యోచిస్తున్నట్లు సమాచారం. అందుకే ఎప్పుడు ఎప్పుడు టిఆర్ ఎస్ తమపై విమర్శలు గుప్పిస్తుందా అని ఆ పార్టీకి చెందిన లక్ష్మణ్ , కిషన్ రెడ్డి , నాగం జనార్ధన రెడ్డి వంటి వారు ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆ సీన్ రానే రావడంతో మహదానందంగా కేసీఆర్ పై తిట్ల దండకాన్ని మొదలు పెట్టేసింది కాషాయదళం. దాంతో ఇప్పుడు తెలంగాణ లో కాంగ్రెస్ , బిజెపి , టిడిపి ఇలా అన్ని పార్టీలు అధికార పార్టీ వైఫల్యాలను తూర్పారబట్టడంలో పోటీలు పడుతున్నాయి .

Similar News