కమలంతో ఫ్యాన్ కలిసేనా?

Update: 2017-12-08 00:30 GMT

ఏపీ రాజ‌కీయ ప‌రిణామాలు త్వ‌రలోనే మార‌నున్నాయా? ముఖ్యంగా బీజేపీ-టీడీపీల బంధం తెగిపోతుందా? 2014 నుంచి క‌ల‌సి చేస్తున్న కాపురం.. క‌ల‌హాల కాపురంగానే మారి చివ‌రికి విడాకుల ద‌శ‌కు చేరుకునే స‌మ‌యం కూడా ఆస‌న్న‌మైందా? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి బీజేపీ-టీడీపీలు విడిపోవ‌డం ఖాయ‌మేనా? అంటే ఔన‌నే అంటున్నాయి వైసీపీ నేత జ‌గ‌న్ వ్యాఖ్య‌లు. అదేస‌మ‌యంలో ఏపీలో 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ.. ఈ ద‌ఫా వైసీపీతో పొత్తుకు రెడీ అవుతోందా? దీనికి జ‌గ‌న్ పావులు క‌దుపుతున్నారా? అంటే మౌనమే స‌మాధానంగా తెలుస్తోంది. ఏదేమైనా ఏపీలో రాజ‌కీయాలు మాత్రం రాబోయే రోజుల్లో గ‌రం గ‌రంగా మార‌నున్నాయ‌నేది వాస్త‌వం. విష‌యంలోకివెళ్తే.. 2019లో పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. చేప‌ట్టిన ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌కు అడుగడుగునా పెద్ద ఎత్తున స్పంద‌న వ‌స్తున్న విష‌యం తెలిసిందే.

జగన్ మెలిక ఇదే....

ఇక‌, ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించి బుధ‌వారం(డిసెంబ‌రు 6)తో నెల రోజులు పూర్త‌య్యాయి. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ తన ఛానెల్ సాక్షికి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌.. కొమ్మినేని శ్రీనివాస‌రావు.,. జ‌గ‌న్‌ను ఇంట‌ర్వ్యూ చేశారు. ఈ క్ర‌మంలో అడిగిన ప్ర‌శ్న‌ల్లో.. బీజేపీతో దోస్తీకి వైసీపీ సిద్ధ‌మైంద‌న్న వ్యాఖ్య‌ల‌పై జ‌గ‌న్ స్పందిస్తూ.. వైసీపీ బీజేపీతో దోస్తీ చేస్తుంద‌ని అన‌డం కేవ‌లం టీడీపీ అధినేత చంద్ర‌బాబు అండ్ కో ప్రచారం అని కొట్టి పారేశారు. అయితే, అదేస‌మ‌యంలో బీజేపీని జ‌గ‌న్ ఎక్క‌డా ఒక్క‌మాట కూడా అన‌లేదు. పైగా తాము బీజేపీ జోలికి కూడా పోబోమ‌ని చెప్ప‌లేదు. దీంతో జ‌గ‌న్‌.. బీజేపీతో క‌లిసినా క‌ల‌వొచ్చ‌నే సందేశాలు వ‌స్తున్నాయి. అయితే, ఒక‌వేళ బీజేపీతో క‌లిసి అడుగులు వేయాలంటే.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చేందుకు అంగీక‌రించాల్సి ఉంటుంద‌ని జ‌గ‌న్ మెలిక పెట్ట‌డం గ‌మ‌నార్హం.

టీడీపీ బంధం తెగిపోతేనే....

ఇక నంద్యాల ఉప ఎన్నిక టైంలో బీజేపీకి మిత్రుడిగా ఉన్న చంద్ర‌బాబు జ‌గ‌న్ బీజేపీతో కలుస్తున్నాడంటూ త‌నకు అనుకూల మీడియా చేత అస‌త్య ప్ర‌చారం చేయించిన విషయాన్ని కూడా జ‌గ‌న్ ప్ర‌స్తావించారు. మైనార్టీ ఓట్ల‌కోస‌మే చంద్ర‌బాబు ఈ తంతు న‌డిపించిన‌ట్టు అప్ప‌ట్లో టాక్ కూడా వ‌చ్చింది. దీనిని బ‌ట్టి.. జ‌గ‌న్ త‌న రాజ‌కీయ మ‌నుగ‌డ కోసం అధికారంలోకి వ‌చ్చేందుకు బీజేపీతో పొత్తుకు రెడీ అవుతున్న‌ట్టు అర్ధ‌మ‌వుతోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. అంతేకాదు, హోదా ఇస్తే.. మీతోనే ఉంటా అనే విషయం తాను ప్రధానమంత్రి మోడీకే చెప్పానని జ‌గ‌న్ అన‌డం మ‌రో సంచ‌ల‌నం. సో… కాషాయ పార్టీ తో వియ్యానికి జగన్ రెడీగా ఉన్నట్టే భావించవచ్చునని విశ్లేషకులు అంటున్నారు. అదే ఇంటర్వ్యూలో జగన్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రం అంటే భయపడుతున్నారన్నారు. అందుకే ఇప్పుడే తెగతెంపులు చేసుకోబోరని అంచనా వేశారు. ఎన్నికల కు ఒక మూణ్ణెల్లో, అరు నెలలో ఉండగా అది జరగొచ్చు అన్నారు. దీనిని బట్టి టీడీపీ-బీజేపీల బంధం తెగిపోవడం ఖాయం అని వైసీపీ ఆశాభావం తో ఉందనేది విశ్లేషకుల అంచనా. దీనిని మరింత ఖాయం చేసేందుకే జగన్ సమయం చూసి తన స్నేహహస్తాన్ని చాచారని అంటున్నారు. ఈ క్ర‌మంలో రాబోయే రోజుల్లో ఏపీలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రం కావ‌డం ఖాయంగా క‌నిపిస్తున్నాయి.

Similar News