కన్నడ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. మరోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్, దక్షిణాదిన ఒక రాష్ట్రాన్ని సొంతం చేసుకోవాలని బీజేపీ ఆరాటపడుతున్నాయి. కర్ణాటక రాష్ట్ర ఎన్నికలు త్వరలోనే జరగనుండటంతో అన్ని పార్టీలూ అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రాహుల్ గాంధీ ఒకసారి కర్ణాటకలో పర్యటించి వెళ్లారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కన్నడ రాష్ట్రంలో పర్యటిస్తన్నారు. ఈసారి కన్నడ రాష్ట్రాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని అమిత్ షా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంగళవారం ఆయన కన్నడ రాష్ట్ర పర్యటనకు వచ్చారు.
అమిత్ షా ముందస్తు వ్యూహం...
అమిత్ షా ప్రధానంగా కర్ణాటక రాష్ట్రంపై దృష్టిపెట్టారు. ఇందుకోసం ముందుగానే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేందుకు వచ్చారు. ఆయన దక్షిణ, ఉత్తర కర్ణాటక ప్రాంతాల శాసనసభ్యులతో విడివిడిగా సమావేశయ్యారు. రేపు చిత్రదుర్గకు వెళ్లి అక్కడ సమీక్షను నిర్వహించనున్నారు అమిత్ షా. ముఖ్యంగా నియోజకవర్గాల బాధ్యులతో ఆయన కీలకాంశాలపై చర్చించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ నేతల వైఫల్యంపైనకూడా షా క్లాస్ పీకినట్లు తెలిసింది. అంతర్గత విభేదాల కారణంగానే పార్టీ కార్యక్రమాలు చురుగ్గా సాగడం లేదని అమిత్ షా సమావేశాల్లో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
హిందుత్వ వాదంపైనే....
కర్ణాటకలో గెలుపు బీజేపీకి ఇప్పుడు అవసరం. దక్షిణాది రాష్ట్రాన విస్తరించాలంటే కర్ణాటకకు మించి మరో రాష్ట్రం కమలం పార్టీకి అనుకూలంగా లేదు. అందుకోసమే అమిత్ షా ప్రత్యేకంగా ఇక్కడకు దిగి నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపేందుకు సిద్ధమవుతున్నారు. కన్నడనాట హిందుత్వవాదం కొంత ఎక్కువగా ఉండటంతో దాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకే ఇటీవల ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై నిప్పులు చెరిగారు. సిద్ధరామయ్య అసలు హిందువేకాదు పొమ్మన్నారు యోగి. గోహత్యలు జరుగుతున్నా సిద్ధరామయ్య సర్కార్ చూసీ చూడనట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. దీనిపై సిద్ధరామయ్య కూడా యోగిపై ప్రతి దాడికి దిగారు. తాము స్వామి వివేకానంద హిందుత్వవాదాన్ని అనుసరిస్తామని, గాడ్సే హిందుత్వ వాదాన్ని కాదని ఘాటుగా సిద్ధు విమర్శించారు. కన్నడ రాజ్యంలో హిందుత్వ వాదాన్ని మరింత బలంగా విన్పించేందుకు ఈసారి కమలం పార్టీ యోగి ఆదిత్యానాధ్ ను ప్రచారంలో దింపనుంది. మొత్తం మీద కమలనాధుల కలలు కన్నడ రాష్ట్రాన నెరవేరతాయో లేదో అన్నది పక్కన పెడితే పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాత్రం ఇది గెలిచి తీరాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నారు.
: